యూట్యూబ్ చూసి స్వయంగా డెలివరీ చేసుకున్న యువతి

వినాశకాలానికి విపరీత బుద్ధి అన్నారు.యూట్యూబ్ చూసి వంట చేసారు అంటే అర్ధం ఉంది. ఒక వేళ వండిన పదార్థం అటూ ఇటూ అయినా తిరిగి వండుకోవచ్చు. కానీ మూర్ఖత్వం పరాకాష్టకు చేరిన ఓ మహిళ యూట్యూబ్ చూసి స్వయంగా డెలీవరీ చేసుకుంది. అనంతరం పుట్టిన బిడ్డను గొంతునులిమి చంపేసింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర లోని నాగ్‌పూర్‌ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక అంబజారీ ప్రాంతానికి చెందిన ఓ 15 ఏండ్ల బాలికకు సోషల్‌ మీడియా ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత సదరు వ్యక్తి ఆ బాలికకు లైంగికంగా దగ్గరవ్వడంతో ఆమె గర్భం దాల్చింది. ఆ విషయాన్ని బాలిక ఇంట్లో చెప్పకుండా దాచిపెట్టింది. కొన్ని రోజులకు కడుపు పెద్దగా కనిపించడంతో తల్లి ప్రశ్నించింది. అయితే అనారోగ్యం కారణంగానే కడుపు ఉబ్బిందంటూ తల్లికి అబద్దాలు చెప్పింది. అనంతరం డెలివరీ ఎలా చేసుకోవాలో యూట్యూబ్‌ వీడియోలను చూసి తెలుసుకుంది. ఈ నెల 2వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందును గొంతునులిమి చంపేసి.. ఇంట్లోనే ఓ పెట్టెలో మృతదేహాన్ని దాచిపెట్టింది. పనిమీద బయటకు వెళ్లిన తల్లి ఇంటికి తిరిగొచ్చేసరికి బాలిక అనారోగ్యంతో నీరసంగా కనిపించింది. దీంతో ఆమె గట్టిగా నిలదీయగా.. ఆ బాలిక మొత్తం విషయాన్ని తల్లికి చెప్పేసింది. బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి.. నవజాతశిశువు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించామని పోలీసులు తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: