హిందూ ధర్మ రక్షణతోనే దేశ రక్షణ సాధ్యమని, ఈ విషయంలో ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని శ్రీభువనేశ్వరీ పీఠాధిపతి కమలానంద భారతీస్వామి పేర్కొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డితో కలిసి మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ దేశంలో యథేచ్ఛగా గోహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని బలహీనం చేసే కుట్ర జరుగుతున్నదని వాపోయారు. హిందుత్వ శక్తులు బలపడితేనే హిందూ సమాజంతో పాటు దేశానికి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. దేశం కోసం, ధర్మం కోసం శివాజీ యుద్ధాలు చేశాడని, ఆయన ప్రేరణతోనే ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. రాబోయే రెండేళ్లలో జాతీయ విద్యా విధానం అమలోకి వస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ప్రతీ యువకుడు శివాజీలా తయారుకావాలని, గో సంరక్షణ, గోసేవ చేయాలని పిలుపునిచ్చారు. గ్రామగ్రామాన శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని, యువత ఆయన బాటలో నడుస్తూ ధర్మాన్ని కాపాడాలన్నారు. రానున్నరోజుల్లో భారత్ హిందూ దేశంగా అవతారించాలని ఆకాక్షించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ స్త్రీలను గౌరవించిన ఆదర్శప్రాయుడు శివాజీ మహరాజ్, ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవలు దేశానికి గర్వకారణమన్నారు.
వైభవంగా శోభయాత్ర
శివాజీ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జిల్లా కేంద్రం జెండాలు, తోరణాలతో కాషాయ వర్ణపు శోభ పులుముకుంది. మెదక్ ధ్యాన్‌చంద్ చౌరస్తా నుంచి శివాజీచౌక్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి ప్రారంభించారు. అనంతరం ర్యాలీలో ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు.వేలాదిగా తరలివచ్చిన యువత జై శ్రీరామ్.. జై భవానీ-వీర శివాజీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రత్యేక వాయిద్య బృందం చప్పుళ్లు.. డీజే నృత్యాల నడుమ యువకులు కాషాయ ధ్వజాలు చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, విగ్రహ కమిటీ అధ్యక్షుడు మాయ శంకర్, నాయిని ప్రసాద్, కామేశ్వర్, సునీల్, రాంచంద్రం, గోవింద్‌రాజ్, నాగరాజు, కిట్టు, పరుశరాం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.