సమస్త లోకాలను నడిపించు సదాశివుడిని భక్తి తప్ప మరేది బంధించలేదు. త్రిమూర్తులలో శివుడు మాత్రమే తొందరగా స్పందిస్తాడు … ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వరాలను ప్రసాదిస్తూ ఉంటాడు. ఈ కారణంగానే ఆయన మానవులకు … దేవతలకే కాదు, రాక్షసులకు సైతం వరాలను ప్రసాదించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అంతరంగంలో అంతకంతకూ పెరిగిపోతున్న భక్తికి మాత్రమే ఆయన ప్రాధాన్యతను ఇచ్చాడేగానీ, ఆ భక్తుడు మానవుడా … రాక్షసుడా అనే ఆలోచన ఆయనలో ఎక్కడా కూడా కనిపించదు. ఈ కారణంగానే అంతా తేలికగా ఆయన మనసు గెలుచుకోవడానికి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు.
సాధారణంగా శివుడి అనుగ్రహాన్ని ఆశించేవాళ్లు, ఆయనకి మారేడు దళాలతో కూడిన పూజాభిషేకాలు నిర్వహిస్తే సరిపోతుందని అనుకుంటూ ఉంటారు. అయితే శంకరుడి కరుణ పొందడానికి మరింత తేలికైన మార్గం ఉందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అదేమిటంటే … ఆయనకి ఎంతో ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించడం. పాయసమంటే పరమశివుడికి పంచప్రాణమాట. ఎక్కడ పాయసం చేస్తుంటే అక్కడికి ఆయన క్షణాల్లో చేరుకుంటాడని అంటారు.
తనకి ఎంతో ఇష్టమైన పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించిన వాళ్లు దానిని వెంటనే తిన్నప్పుడే ఆయన సంతోష పడతాడట. లేదంటే అసహనానికి లోనవుతాడని అంటారు. ఈ కారణంగానే శివుడి ప్రసాదాన్ని తినడంలో ఆలస్యం పనికిరాదని పెద్దలు చెబుతుంటారు. ఆలయాల్లోగానీ … ఇంట్లోగాని శివ ప్రసాదాన్ని వెంటనే స్వీకరించాలనే నియమాన్ని పాటిస్తూ ఉంటారు.