మెదక్ పై ఫోకస్ పెట్టిన మైనంపల్లి

మెదక్ నియోజకవర్గంపై జిల్లా నేత, ఎమ్మెల్యే, చిన్న శంకరంపేట మండలం వాసి మైనంపల్లి హనుమంతరావు మరోసారి మెదక్ జిల్లా రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మాల్కాజ్ గిరి అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన… తన కుమారుడుని మైనంపల్లి రోహిత్ ని మెదక్ నుండి బరిలోకి దింపాలని పావులు కదుపుతున్నారు.

సేవా ఫౌండేషన్ పేరు జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. హనుమాన్ శోభాయాత్రకు లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.

మెదక్ లో నిజానికి  గతంలో ఇదే సీటు నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు మైనంపల్లి హన్మంతరావు. టీడీపీలో ఉండగా జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన మైనంపల్లికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక మెదక్ నియోజకవర్గానికి వస్తే చాలా మంది నేతలు, కార్యకర్తలే కాదు పలు పార్టీల్లోని నేతలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత….. ఆయన మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నారు. ఇక 2018 ఎన్నికల్లో మల్కాజ్ గిరి అసెంబ్లీ సీటు నుంచి గెలిచి విక్టరీ కొట్టారు. ఇదే సమయంలో ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్‌ ను రంగంలోకి దింపే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో భాగంగా ‘మైనంపల్లి సోషల్‌ ఆర్గనైజేషన్‌’ పేరుతో భారీగా సేవలు కార్యక్రమాలు చేస్తున్నారు. వీటన్నింటని కూడా ఆయన కుమారుడే చూస్తున్నారు. అయితే ఈసారి కుమారుడిని అసెంబ్లీకి పంపించి… తాను ఎంపీగా బరిలో(మల్కాజ్ గిరి) ఉండాలని పావులు కదిపారు మైనంపల్లి. ఫలితంగానే మంత్రి మల్లారెడ్డితో విబేధాలు మొదలయ్యాయనే టాక్ కూడా వినిపించింది. ఓ దశలో మంత్రి టార్గెట్ గా మీడియా సమావేశం పెట్టి పలు విమర్శలు చేశారు మైనంపల్లి. ఇందులో పలు అంశాలను ప్రస్తావిస్తూ… మంత్రి తీరును తప్పుబట్టారు. ఇదిలా ఉండగానే తాజాగా మైనంపల్లి మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అనూహ్యంగా మళ్లీ మెదక్ పై కన్నేయటంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మెదక్‌ నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌పై రోహిత్‌రావు పోటీ చేస్తారని కొద్ది రోజులుగా నియోజకవర్గంలో కూడా తెగ ప్రచారం జరుగుతున్నది. ఏళ్ల తరబడి ఆగిపోయిన సేవా కార్యక్రమాలను ఇప్పుడు రోహిత్‌ కొనసాగిస్తాడని చెప్పడంతో వచ్చే ఎన్నికల్లో మెదక్‌ నుంచి తన కొడుకు పోటీలో ఉంటారన్న విషయాన్ని పరోక్షంగా హన్మంతరావు ప్రకటించినట్టయింది.

ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి వర్గాలు మాత్రమే ఉండగా… తాజాగా మైనంపల్లి సీన్ లోకి రావటంతో మెదక్ రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. మరోవైపు బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ కూడా డైలమాలో పడింది. అయితే మైనంపల్లి తీరుపై స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవందర్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు తెలియకుండా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టడంపై సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మొత్తంగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ… మెదక్ పాలిటిక్స్ మాత్రం హీట్ ను పెంచేస్తున్నాయి. అయితే నేతలు మాత్రం టికెట్ కోసం ఎవరికి వారుగా ప్రయత్నాలు చేసుకుంటున్న వేళ… హైకమాండ్ ఆశీస్సులు ఎవరికి దక్కుతాయనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

%d bloggers like this: