ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారస ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో మూడు సార్లు విచారించారు కవితను. ఆ సమయంలో కవిత వాడిన ఫోన్లకు ఈడీ స్వాధీనం చేసుకుంది. ఫోన్లు తెరవడానికి కవిత లేదా ఆమె తరుపున ఎవరైన హాజరు కావచ్చు అని ఈడీ కవితకు చెప్పింది. అయితేే కవిత అడ్వకేట్ సోమా భరత్ వరుసగా రెండో రోజు ఈడీ ఆఫీస్ కు వచ్చారు. సోమా భరత్ సమక్షంలోనే కవిత ఫోన్లలో డేటాను అధికారులు సేకరిస్తున్నారు. అయితే ఫోన్లలో ఉన్న సమాచారాన్ని బహిర్గతం చేయనప్పటికీ..అందులో ఎలాంటి విషయాలు వెల్లడయ్యాయనేది ఆసక్తికరంగా మారింది. కాగా కవిత ఈడీకి ఇచ్చిన 10 ఫోన్లలో డేటాను అధికారులు రికవరీ చేస్తున్నారు. అయితే ఇందుకు సాక్షిగా కవిత గాని ఆమె ప్రతినిధి గాని రావాలని నిన్న నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో నిన్న సోమా భరత్ ఈడీ ఆఫీస్ లోనే దాదాపు 6 గంటలు ఉన్నారు. అయితే ఇవాళ మరోసారి ఆయన ఈడీ ఆఫీస్ కు వెళ్లడంతో ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. సోమా భరత్ బయటకు వస్తే గాని దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ కేసులో ఇప్పటికే నిందితుల నుంచి చాలా సమాచారాన్ని అటు ఈడీ, ఇటు సీబీఐ సేకరించింది. ముఖ్యంగా సౌత్ గ్రూప్ కు సంబంధించి నిధుల గురించి..అలాగే ఎవరి పాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ కేసులో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు సహా హైదరాబాద్కు చెందిన పలువురిని ఈడీ అరెస్ట్ చేసింది. అలాగే ఎమ్మెల్సీ కవిత 4 ఫోన్లు మార్చారని..మరిన్ని ఫోన్లు ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించింది. అంతేకాదు మొత్తం 36 మంది 70 ఫోన్లు మార్చారని ఆరోపిస్తూ వస్తుంది. ఈ ఫోన్ లో డేటా రికవరీ ద్వారా కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.