అభివృద్ధి పనులు ప్రారంభించటానికి హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి మోడీ.. పరేడ్ గ్రౌండ్స్ వేదికగా తెలంగాణ రాష్ట్రంలో పాలన తీరును ఎండగట్టారు. రాష్ట్రంలో కుటుంబం, అవినీతి పాలన నడస్తుందని.. ప్రతి ప్రాజెక్టులో అవినీతి వల్ల ఆలస్యం అవుతుందన్నారాయన. అధికార పార్టీ పేరు ఎత్తుకుండానే.. ఎవరి పేరు ప్రస్తావించకుండానే తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ తీరును విమర్శించారు ప్రధాని మోడీ. తెలంగాణ కొందరి గుప్పిట్లో అధికారం మగ్గుతోందని మండిపడ్డారు. కుటుంబ పాలనకు విముక్తి కలగాలని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని.. అదే నా బాధ, ఆవేదన అన్నారు మోడీ. మేం ప్రజల కోసం పని చేస్తుంటే.. కొందరు మాత్రం అవినీతికే పనులు చేస్తున్నారని రాష్ట్ర పాలనపై విమర్శలు, ఆరోపణలు చేశారాయన. ప్రతి ప్రాజెక్టులో కుటుంబ సభ్యుల ఆసక్తి తప్ప మాత్రమే ఉందని.. ప్రజల ప్రయోనాలు చూడట్లేదన్నారు మోడీ.
అవినీతి, కుటుంబ పాలన వేర్వేరు కాదని.. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా.. వద్దా అంటూ ప్రజలను ప్రశ్నించారు ప్రధాని మోడీ. కుటుంబ పాలకులే అన్నింటిపైనా కంట్రోల్ కోరుకుంటారని.. అలాంటి వారి వల్ల ప్రజలకు నష్టమన్నారు. అలాంటి వ్యక్తుల నుంచి తెలంగాణను కాపాడాల్సిన అసవరం ఉందా లేదా అంటూ ప్రజలను ప్రశ్నించారు మోడీ.
అవినీతిపై పోరాడాలా వద్దా.. అవినీతిని తరిమి కొట్టాలా వద్దా.. తెలంగాణ ప్రజలు చెప్పాలంటూ పిలుపునిచ్చారు మోడీ. అవినీతి చిట్టా బయటకు వస్తుందనే భయంతోనే విపక్షాలు అన్నీ కోర్టుకు వెళ్లాయన్నారు మోడీ. అవినీతిపరులపై పోరాటానికి తెలంగాణ ప్రజల సహకారం కావాలని మోడీ కోరారు. బీజేపీని అశీర్వదిస్తే రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.