తెలంగాణలో మోాదీ పర్యటన ఎప్పుడంటే

తెలంగాణ.. అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలో అడుగు పెట్టింది. వచ్చే సెప్టెంబర్- అక్టోబర్‌ల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడొచ్చు. డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం దాదాపుగా ఖాయమైనట్టే. తెలంగాణతో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ గఢ్, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో అయిదు, ద్వితీయార్థంలో మూడు రాష్ట్రాలకు ఎన్నికలు షెడ్యూల్ కానున్నాయి

ఎన్నికల వేడి..
అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు కసరత్తు చేస్తోన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్- భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తరువాత ఎదుర్కొనబోతోన్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటడానికి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించడానికి ఈ అసెంబ్లీ ఎన్నికలను తొలి మెట్టుగా భావిస్తోన్నారు కేసీఆర్.

ప్రధాని మోదీ రాక..
ఈ పరిణామాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 19 లేదా 20వ తేదీన ఆయన హైదరాబాద్ లో పర్యటించనున్నారు. బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మరికొన్నింటిని ప్రారంభించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలో తెలంగాణ అడుగు పెట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ హైదరాబాద్ పర్యటనకు రాబోతోండటం ఆసక్తి రేపుతోంది.

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం..
తన పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ- వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. వందేభారత్ సిరీస్ లో ఇది ఎనిమిదవ ఎక్స్ ప్రెస్. మొన్నీ మధ్యే వర్చువల్ గా ఏడవ వందేభారత్ రైలును మోదీ పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ లోని హౌరా నుంచి న్యూ జల్‌పాయ్‌గురి మధ్య ఈ రైలు పరుగులు తీస్తోంది.

సికింద్రాబాద్- విజయవాడ మధ్య..
సికింద్రాబాద్- విజయవాడ మధ్య ప్రవేశపెట్టదలిచిన వందేభారత్ ఎనిమిదవ ఎక్స్‌ప్రెస్ ఇది. రద్దీతో కూడుకుని ఉన్న ఈ రెండు నగరాల మధ్య వందేభారత్ ఎక్స్‌‌ప్రెస్ ను ప్రవేశపెట్టడానికి దక్షిణమధ్య రైల్వే అధికారులు ఇదివరకే ప్రతిపాదనలను పంపించారు. వాటిని రైల్వేబోర్డు ఆమోదించింది. ఈ ఎక్స్‌ప్రెస్‌ను మంజూరు చేసింది. ఈ రైలు ప్రారంభోత్సవం జాప్యం కావొచ్చంటూ ఇదివరకు వార్తలొచ్చాయి. ఇప్పుడు తాజాగా అందిన సమాచారంతో అవన్నీ వాస్తవం కావని తేలినట్టయింది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకూ..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రధాని మోదీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ప్రారంభిస్తారు. దక్షిణమధ్య రైల్వే జోన్ ప్రధాన కేంద్రం కొనసాగుతోన్న సికింద్రాబాద్ లో రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు గతంలో యూపీఏ ప్రభుత్వం అనుమతులను మంజూరు చేసింది. ఇప్పుడు తాజాగా మోదీ ఆ పనులను ప్రారంభించనున్నారు.

Leave a Reply

%d