తల నిండా అప్పులు.. తీర్చే దారి కనిపించడం లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. అప్పుడు ఆ వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది. తన పేరిట 7.4 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించి.. తన చనిపోయినట్టు నాటకం ఆడితే.. ఆ వచ్చే డబ్బుతో అప్పులు తీర్చేయొచ్చు కదా.. అని ప్లాన్ చేశాడు. ఏడాది నుంచి ప్లాన్ అమలు చేయడం మొదలు పెట్టాడు. మరి తను చనిపోయినట్టు అంతా నమ్మాలంటే ఎలా? అందుకు ఒక శవం కావాలి. శవం ఎక్కడ దొరుకుతుంది.. అందుకే ఒక కార్మికుడిని ట్రాప్ చేశాడు. గొడ్డలితో హత్య చేసి.. పెట్రోల్ పోసి రూపురేఖలు దొరక్కుండా తగలబెట్టాడు. ఈ డ్రామాలో అతడి భార్య కూడా తన వంతు పాత్ర పోషించింది. కారులో ఉన్న శవం తన భర్తదేనని పోలీసులకు చెప్పింది. కానీ.. పోలీసులకు ఎక్కడో సందేహం వచ్చి.. కూపీ లాగితే.. అసలు కుట్ర బయటపడింది. ఆ కుట్ర చేసింది సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మానాయక్. హత్యకు గురైన అమాయకుడు.. బాబు అనే కార్మికుడు. కుట్రలో భాగస్వాములు ధర్మానాయక్ భార్య నీల.. అల్లుడు శ్రీను నాయక్, సోదరి సునంద. వీరితోపాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో బయటపడిన సంచన విషయాలను మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని.. బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
వివరాలు ఇలా ఉన్నాయి.. టెక్మాల్ మండలం వెంకటాపురం గ్రామ శివారులో ఈ నెల 9 న కారు తగులబడిపోయి కనిపించింది. అందులో శవం కాలిపోయి ఉంది. ఈ శవం తన భర్త ధర్మానాయక్‌దేనని అతని భార్య నీల చెప్పడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో పెట్రోల్ బాటిల్ దొరకడంతో ధర్మానాయక్‌ను ఎవరో హత్య చేశారనే కోణంలో దర్యాప్తు చేశారు. ఎస్పీ రోహిణి.. స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు సందర్భంగా ధర్మానాయక్ కుటుంబ సభ్యుల వ్యవహార శైలిని పోలీసులు అనుమానించారు. పోస్టుమార్టం సమయంలో శవం పాదాలు వేరే వ్యక్తివిగా గుర్తించారు. దీంతో ధర్మానాయక్ కుటుంబ సభ్యులపై ఒక కన్నేసి ఉంచారు.
ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో భారీ నష్టాలు
ఆన్ లైన్ ట్రేడింగ్ లో స్టాక్ మార్కెట్ షేర్లు కొన్న ధర్మా నాయక్ కు భారీ స్థాయిలో నష్టాలు వచ్చినట్లు ఎస్పీ రోహిణి తెలిపారు. చిట్టీలు వేసిన వ్యక్తుల నుంచి ధర్మానాయక్ డబ్బు తీసుకుని.. తిరిగి చెల్లించక పోవడంతో పాటు.. అప్పుల ఊబిలో కూరుకు పోయాడు. దీన్నుంచి బయటపడేందుకు కుటుంబ సభ్యులతో చర్చించి ప్లాన్ వేశాడు.
25 ఇన్సూరెన్స్ కంపెనీలలో 7.4 కోట్ల మేరకు పాలసీలు చేయించారు. ఆపై ఆ పాలసీ డబ్బులు రాబట్టడంపై పథకం రచించారు. ఎవరినైనా చంపి.. ఆ శవం తనదేనని రుజువు చేస్తే బీమా సొమ్ము వస్తుందని ఎత్తు వేశారు. ఇందుకోసం నిజామాబాద్ రైల్వే స్టేషన్ లేబర్ అడ్డా నుంచి 40-45 సంవత్సరాల బాబు అనే కార్మికుడిని కలిసి.. మామిడి తోటలో పని కల్పిస్తామని, నెలకు 15 వేల నుంచి 20 వేల వరకు ఇస్తామని నమ్మ బలికారు.