బీఆర్ ఎస్‌లో ముసలం రోజురోజుకు రాజుకుంటుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్టీ ప్రత్యేకంగా గురి పెట్టింది. ఇటీవల ఆయన పినపాక, ఇల్లందు, మధిర ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. తాజాగా అశ్వరావుపేటలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఇలాకాలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం విశేషం. గత కొన్ని నెలలుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధిష్టానం పై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.
గత సంవత్సరం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాపై దృష్టి సారించారు. అవసరమైతే వేరే పార్టీ కైనా వెళ్లడానికి సిద్ధమని బీఆర్ఎస్‌కు సవాళ్లు విసిరారు. వరుసగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, ఇల్లెందు, మధిరతో పాటు తాజాగా అశ్వరావుపూటలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
పదికి పది చోట్ల పోటీ చేపిస్తా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాల్లో తన అభ్యర్థులు ఉంటారని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే దేనికైనా సిద్ధమని చెప్పకనే చెప్పారు. తాను టిఆర్ఎస్ నుంచి గెలవలేదని వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా గెలిచారని స్పష్టం చేశారు. అయినప్పటికీ సిట్టింగ్ స్థానం తనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం దారుణమైన విషయమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్‌కు శ్రీనివాసరెడ్డికి మధ్యలో పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పదికి పది స్థానాలు నా అభ్యర్థులు ఉంటారని చెప్పకనే చెప్పారు. పార్టీ ఏదైనా పది మంది అభ్యర్థులు గెలవడం ఖాయమని పేర్కొన్నారు.
స్థానిక ప్రజా ప్రతినిధులపై భారీ వేటు?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధులపై బీఆర్ ఎస్ భారీ వేటు వేసింది. వాస్తవానికి మొన్నటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ ఎస్ ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది. ప్రస్తుతం అందుకు ధీటుగా పొంగులేటి వర్గం దూసుకుపోతుంది. ఇటీవల వైరా అభ్యర్థిగా విజయ భాయ్ ప్రకటించడంతో పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి వెంట నిలిచారు. అదేవిధంగా వారందరికీ అండగా ఉంటానని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమం జరిగిన 24 గంటల్లో వైరా మున్సిపల్ చైర్మన్ నామినేటెడ్ పోస్టులో ఉన్న ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజా ప్రతినిధులను 20 మందిని బహిష్కరించారు.
ఎవరికి తలొగ్గే ప్రసక్తే లేదు?
నేను ఎవరికీ తలొగ్గే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అశ్వరావుపేట వేదికగా చెప్పకనే చెప్పారు. వాస్తవానికి నేను గత ఎన్నికల్లో అందరి గెలుపు కోసమే పని చేశానని స్పష్టం చేశారు. తనపై కావాలని కొందరు కుట్ర చేసి బీఆర్ ఎస్‌కు దూరం చేశారన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ఉమ్మడి జిల్లాలో ప్రజలు నీరాజనాలు పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తన నిర్ణయం ఏమిటో ప్రకటిస్తానని స్పష్టం చేశారు.