పవన్‌ కల్యాణ్‌ అభిమానిని కొట్టి చంపిన ప్రభాస్‌ ఫ్యాన్‌!

సినిమా స్టార్ల అభిమానుల మధ్య గొడవలు జరగటం మామూలే. అయితే, ఆ గొడవలు శృతిమించితే దారుణ పరిస్థితి వస్తాయి. అభిమానం వెర్రి తలలు వేస్తున్న కొంతమంది ఫ్యాన్స్‌ వేరే హీరోల ఫ్యాన్స్‌పై అనవసరంగా గొడవకు దిగటమే కాకుండా.. హత్యలు చేయటానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా, ఓ ప్రభాస్‌ ఫ్యాన్‌ పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్‌ను కొట్టి చంపాడు. వాట్సాప్‌ స్టాటస్‌ విషయంలో గొడవ జరగటంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కిశోర్‌, హరికుమార్‌లు పేయింటర్లు. వీరిద్దరూ మూడు రోజుల క్రితం అత్తిలిలోని ఓ ఇంట్లో పని చేయటానికి వచ్చారు. కిషోర్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమాని కాగా.. హరికుమార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఏలూరు జిల్లా సెక్రటరీగా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఇద్దరూ పని ముగించుకుని ఆ ఇంట్లోనే నిద్రిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కిశోర్‌ పవన్‌ కల్యాణ్‌ స్టాటస్‌ పెట్టాడు. అది చూసిన హరి ప్రభాస్‌ వీడియోను స్టాటస్‌గా పెట్టుకోమని ఒత్తిడి చేశాడు. ఇందుకు కిశోర్‌ ససేమీరా అన్నాడు. దీంతో మాటామాటా పెరిగింది. ఆగ్రహానికి గురైన హరి.. కిశోర్‌ను సెంట్రింగ్‌ కర్రతో కొట్టాడు. ఆ తర్వాత ఇటుకతో తలపై బాది హత్య చేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Leave a Reply

%d