ఈ రూట్ లో వెళ్లకండి

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయడంతో పాటు పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో పాటు మళ్లించనున్నట్లు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. మోనప్ప (రాజీవ్ గాంధీ విగ్రహం), గ్రీన్‌లాండ్స్, ప్రకాశ్‌నగర్, రసూల్‌పురా, సీటీవో ప్లాజా, ఎస్‌బీహెచ్, వైఎంసీఏ, సెయింట్ జాన్ రోటరీ, సంగీత్ క్రాస్‌రోడ్, ఆలుగడ్డ బావి, మెట్టుగూడ, చిలకలగూడ, బ్రూక్ బాండ్, టివోలి, బాలమ్రాయ్, స్వీకర్ ఉపకార్, సికింద్రాబాద్ క్లబ్, తిరుమలగిరి, తాడ్‌బండ్, సెంట్రల్ పాయింట్ మార్గాల్లో కఠినమైన ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.

ఆయా ప్రాంతాల మీదుగా ప్రయాణం చేయొద్దని, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. టివోలీ జంక్షన్‌ నుంచి ప్లాజా జంక్షన్‌, ఎస్బీహెచ్‌ ఎక్స్‌రోడ్స్‌ నుంచి స్వీకార్‌ ఉప్‌కార్‌ జంక్షన్‌ మధ్య మార్గాన్ని పూర్తిగా మూసివేస్తారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు వీలైనంత త్వరగా చేరుకోవాలని కోరారు. ఇక చిలకలగూడ, సెయింట్‌ జాన్స్‌ రోటరీ, సంగీత్‌ జంక్షన్‌, రేతిఫైల్‌ టీ జంక్షన్ల నుంచి వచ్చే ప్రయాణికుల వాహనాలను అనుమతించరు. ప్రయాణికులు క్లాక్‌ టవర్‌ పాస్‌పోర్టు ఆఫీస్‌, రెజిమెంటల్‌ బజార్‌ మార్గం మీదుగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ మెయిన్‌ గేట్‌ వద్దకు చేరుకోవాలి. కరీంనగర్‌ వైపు నుంచి రాజీవ్‌ రహదారి మీదుగా సికింద్రాబాద్‌ నగరంలోకి వచ్చే వాహనదారులు ఓఆర్‌ఆర్‌ మీదుగా దిగి కొంపల్లి, సుచిత్ర, బాలానగర్‌, మూసాపేట్‌, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట్‌ మీదుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉంటుంది. కీసర ఓఆర్‌ఆర్‌ గేట్‌ నుంచి ఈసీఐఎల్‌, మౌలాలీ, నాచారం, ఉప్పల్‌ మీదుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉంటుంది.

తిరుమలగిరి క్రాస్‌రోడ్డు వద్ద నుంచి ఎడమవైపు తీసుకొని ఏఎస్‌రావునగర్‌, ఈసీఐఎల్‌, మౌలాలీ, తార్నాక నుంచి సిటీలోని ఆయా ప్రాంతాలకు వెళ్లాలి. కరీంనగర్‌ వైపు రాకపోకలు సాగించే వారు తిరుమలగిరి క్రాస్‌రోడ్స్‌, జేబీఎస్‌ రూట్లలో వెళ్లకుండా ఓఆర్‌ఆర్‌పై నుంచి వెళ్లాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు. కరీంనగర్‌ మార్గం నుంచి వచ్చే బస్సులు దోబీఘాట్‌ వద్ద నిలుపాల్సి రానున్నది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మెదక్‌, సంగారెడ్డి వైపు నుంచి వచ్చే వాహనాలు బైసన్‌ పోలో గ్రౌండ్స్, రంగారెడ్డి, కర్నూల్‌, అచ్చంపేట్‌, నల్గొండ, ఖమ్మం, సూర్యపేట్‌, వరంగల్‌, యాదాద్రి మార్గంలో వచ్చే వారు ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్‌లో పార్క్‌ చేయాలి. రాజీవ్‌ రహదారి వైపు నుంచి వచ్చే వాహనాలను కంటోన్మెంట్‌ పార్కు గ్రౌండ్‌, పికెట్‌ డిపో ప్రాంగణంలో, అలాగే రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాల నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్‌ రోడ్డులో పార్క్‌ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్‌ పోలీసులు కోరారు.

Leave a Reply

%d