ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాకిస్థాన్‌లో అల్లర్లు

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అరెస్టుతో ఆ దేశంలో అల్లర్లు జరుగుతున్నాయి. పీటీఐ కార్యకర్తలు వీథుల్లోకి వచ్చి, విధ్వంసం సృష్టిస్తున్నారు. రావల్పిండిలోని గవర్నమెంట్ హెడ్‌క్వార్టర్స్‌ (GHQ)పై దాడికి యత్నించారు. ఈ కార్యాలయం బయట ఉన్న సింహద్వారం తలుపులను ఓ మహిళ బలంగా కదుపుతున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియో వైరల్ అయింది. జీహెచ్‌క్యూ గేట్ వద్దకు తక్షణమే తరలిరావాలని రావల్పిండిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

For More News Click: https://eenadunews.co.in/

ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసి, గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయనను బుధవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎన్ఏబీ అధికారి ఒకరు చెప్పారు. ఆయనకు వైద్య పరీక్షలు చేయించామని, మెడికల్ రిపోర్టును కూడా బుధవారమే కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు.

దేశవ్యాప్త నిరసనలు

పీటీఐ కార్యకర్తలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పాక్ రేంజర్లపై రాళ్ల దాడులు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా, పీటీఐ కార్యకర్తలు కరాచీలో ఓ పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. ఈ వాహనంలో ఖైదీలు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. కార్ప్స్ కమాండర్ లాహోర్ హౌస్‌పై కూడా ఇమ్రాన్ మద్దతుదారులు దాడి చేసి, నిప్పు పెట్టారు. మరోవైపు ఈ నిరసనలకు మద్దతివ్వాలని పీటీఐ కార్యకర్తలకు, ప్రజలకు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా పిలుపు ఇస్తున్నారు. ఇమ్రాన్ అరెస్టు చట్టవిరుద్ధమని పీటీఐ ఉపాధ్యక్షుడు మహమూద్ ఖురేషీ ఓ వీడియో సందేశంలో చెప్పారు. ‘‘మీ భవిష్యత్తు కోసం పోరాడుతున్న గొప్ప నాయకుడైన ఇమ్రాన్ ఖాన్ కోసం మీరంతా మీ ఇళ్ల నుంచి బయటకు రావాలి, ఈరోజు ఎవరూ ఇళ్ల దగ్గర లేరు’’ అని పిలుపునిచ్చారు. ఇమ్రాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున లాహోర్ కంటోన్మెంట్‌లోని షెర్పావో వంతెనను దాటుకుని వెళ్లారు. లాహోర్‌లోని సైనిక కమాండర్ల ఇళ్లపై కూడా దాడులు చేశారు. ఫైసలాబాద్‌లో కూడా ఇమ్రాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

 

Leave a Reply

%d