పుష్యమాసం విశిష్టత

శుభ ముహూర్తాలకు శూన్య మాసమైనా పండుగలకు పూర్ణ మాసం పుష్య మాసం. పుష్య మాసాన్ని పౌష్య మాసమని కూడా పిలుస్తారు. పౌష్యమంటే పోషణమని అర్ధం. విశేషమేమంటే దక్షిణాయనం పుష్య మాసంతో ముగుస్తుంది ఉత్తరాయణం కూడా పుష్య మాసంతోనే ప్రారంభమవుతుంది.

ముక్కోటి ఏకాదశి, భోగి, మకర సంక్రాంతి మొదలగు ముఖ్య పండుగలు పుష్య మాసంలో వస్తాయి. అయ్యప్ప దీక్ష 40 రోజుల్లో ఎక్కువ రోజులు పుష్య మాసంలోనే ఉంటాయి. దైవారాధన ప్రాముఖ్యత ఉన్న మాసం పుష్య మాసం. పితృ దేవతలను పూజించవల్సిన మాసం కూడా ఇదే. వైష్ణవ క్షేత్రాల్లో వైకుంఠ ద్వార దర్శన మహా భాగ్యం కలిగేది పుష్య మాసంలోనే.
నారాయణుడిని పుష్య మాసంలో విశేషంగా
కొలుస్తారు.
గోదాదేవి శ్రీ రంగనాథుని తిరుప్పావై పాశురములతో అర్చించి, రంగనాథుని కళ్యాణం చేసుకొని శ్రీ రంగనాథునిలో లీనమై పోయింది పుష్య మాసంలోనే. గోపికలు కాత్యాయని వ్రతం చేసి శ్రీ కృష్ణుని వివాహం చేసుకుంది పుష్య మాసంలోనే. పెళ్ళి కాని ఆడ పిల్లలు వివాహం కోసం ఈ మాసంలో కాత్యాయని వ్రతం ఆచరిస్తారు. హరిదాసులు, గంగిరెద్దుల బసవన్నలతో సందడిగా ఉంటుంది. ఇంటి ముందు రంగ వల్లులతోను, పూలతో అలంకరించిన గొబ్బెమ్మలతోనూ ఆహ్లాదకరంగా
ఉంటుంది పుష్య మాసంలో.
పంటలు చేతికొచ్చే సమయం కూడా పుష్య మాసమే. కొత్త బియ్యం, కొత్త బెల్లం, నువ్వులు రైతుల చేతికి వస్తాయి. పుష్య మాసంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నువ్వులు బెల్లంతో చేసిన వంటకాలు శరీరం ఉష్ణోగ్రత పెంచి చలి ప్రభావం నుంచి రక్షిస్తాయి. ధాన్య లక్ష్మీతో పాటు ధనలక్ష్మీ రైతుల చెంత చేరుతుంది.

జ్యోతిష్య పరంగా చూస్తే, సూర్య గ్రహ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే, జపాలు, హోమాలు, దానాలు చేయటానికి పుష్య మాసం మంచి తరుణం. శని జన్మ నక్షత్రం పుష్యమి. శని గ్రహ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే, శని గ్రహానికి జపాలు, హోమాలు, దానాలు చేయటానికి కూడా మంచి సమయం.

మీనాక్షి మధురవాణి

Leave a Reply

%d