పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో రాహుల్ పాదయాత్ర

మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, బీజేపీ సీనియర్‌ నాయకురాలు ఉమా భారతి ‘భారత్‌ జోడో యాత్ర’పై స్పందించారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో ఈ యాత్ర చేపట్టాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి సూచించారు. దేశాన్ని నిజంగా ఏకం చేయాలని ఆయన భావిస్తే ‘భారత్‌ జోడో యాత్ర’ను పీవోకేలో చేపట్టి ఆ ప్రాంతాన్ని భారత్‌లో కలుపాలని అన్నారు. ‘ఇది జరిగిన తర్వాతే భారత్‌కు తిరిగి రండి, లేకపోతే పీవోకేలోనే ఉండండి’ అని ఎద్దేవా చేశారు. బితుల్‌ ప్రాంతంలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఉమా భారతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె రాహుల్‌ గాంధీపై విమర్శలు చేశారు. ‘రాహుల్ గాంధీ నిజంగా దేశాన్ని ఏకం చేయాలనుకుంటే, పీవోకేను భారత్‌లో కలుపాలి. అక్కడ యాత్ర చేయాలి. పీవోకేను భారత్‌లో కలిపిన తర్వాతే తిరిగి రావాలి. లేకపోతే అక్కడే ఉండాలి’ అని అన్నారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ పునరుద్ధరణ కోసం ప్రయత్నిస్తున్న రాహుల్‌ గాంధీ, బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు ‘భారత్‌ జోడో యాత్ర’ చేపట్టారు. ఈ యాత్ర ఇప్పటి వరకు పది రాష్ట్రాల మీదుగా సాగింది. 2,800 కిలోమీటర్ల దూరం కవర్‌ అయ్యింది. మంగళవారం ఢిల్లీ నుంచి తిరిగి ప్రారంభమై ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించనున్నది. ఈ నెలాఖరులో జమ్ముకశ్మీర్‌ చేరిన తర్వాత ఈ యాత్ర ముగుస్తుంది.

Leave a Reply

%d