అన్నకు ఆయువు పోసిన చెల్లెలు

ర‌క్షాబంధ‌నం.. శ్రావ‌ణ మాస పౌర్ణ‌మి రోజున భార‌తీయులు చేసుకునే అద్భుత‌మైన పండ‌గ‌. అక్కాచెల్లెళ్లు త‌మ అన్న‌ద‌మ్ముల క్షేమం కోరుతూ.. వారు క‌ల‌కాలం చ‌ల్ల‌గా ఉండాల‌ని దీవిస్తూ వారి చేతికి ర‌క్షాబంధ‌నం క‌డ‌తారు. ఆ బంధ‌నం వారి మ‌ధ్య అనుబంధానికి ప్ర‌తీక‌గా నిలుస్తుంది. అది క‌ట్టిన త‌ర్వాత త‌మ సోద‌రుల‌కు ఎలాంటి ఆప‌ద రాకూడ‌ద‌ని, వారు సంపూర్ణ ఆయురారోగ్యాల‌తో వ‌ర్ధిల్లాల‌ని ఆ అక్క‌చెల్లెళ్లు ఆకాంక్షిస్తారు. అయితే, కేవ‌లం ఒక్క రాఖీ పండుగ రోజు మాత్ర‌మే కాదు.. జీవితాంతం త‌మ సోద‌రులు బాగుండాల‌న్న ఆకాంక్ష‌తో కొంద‌రు సోద‌రీమ‌ణులు త‌మ శ‌రీర భాగాల‌ను వారికి దానం చేసిన ఘ‌ట‌న‌లు కొన్ని ఉన్నాయి. త‌మ సోద‌రుడు చావుబ‌తుకుల్లో ఉన్న‌ప్పుడు త‌మ ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెట్టి, త‌మ శ‌రీర అవ‌య‌వాల‌ను దానం చేయ‌డానికి ముందుకొచ్చారు కొంద‌రు. కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసిన‌వారు కొంద‌రైతే, త‌మ‌కున్న రెండు మూత్ర‌పిండాల్లో ఒక‌దాన్ని ఇచ్చేసిన‌వారు మ‌రికొంద‌రు. ఆ స్ఫూర్తిదాయక‌ విష‌యాల్లో కొన్నింటిని ఇప్పుడు మ‌నం చూద్దాం.

అన్న కోసం కాలేయం దానం చేసిన చెల్లి

మ‌నిషి శ‌రీరంలో ప్ర‌తి ఒక్క అవ‌య‌వం ఎంతో ముఖ్యం. అందులోనూ కాలేయం పోషించే పాత్ర చాలా కీల‌కం. మానవ శరీరంలో కాలేయం అతిపెద్ద గ్రంధి. ఇది జీర్ణక్రియ, పోషక జీవక్రియ, నిల్వ లాంటి ముఖ్యమైన విధులు నిర్వర్తిస్తుంది. మన శరీరంలో వెలువడే వివిధ రకాల హానికరమైన రసాయన పదార్థాలను అది శోషించుకుని, శరీరానికి నష్టం కలగకుండా చూస్తుంది. మద్యపానం, ఊబకాయం, కొన్ని రకాల వైరస్ లు, బ్యాక్టీరియా, మందుల వల్ల కాలేయం పాడవుతుంది. ఇలా కాలేయం పాడైతే.. దాన్ని మార్చ‌డం త‌ప్పనిస‌రి. అయితే, మొత్తం కాలేయాన్ని ఇవ్వాల్సిన అవ‌స‌రం లేకుండా, ఆరోగ్య‌వంతులైన వ్య‌క్తులు త‌మ కాలేయంలో కొంత భాగాన్ని.. అంటే దాదాపు 60 శాతం వ‌ర‌కు దానం చేయొచ్చు. దాన్ని అమ‌రిస్తే, స‌మ‌స్య ఉన్న‌వారికి పూర్తిగా న‌య‌మ‌వుతుంది. అలా అమ‌ర్చిన కాలేయం మ‌నిషి శ‌రీరంలో పెరిగి, పూర్తిస్థాయిలో ఎదుగుతుంది. నిర్మ‌ల్ జిల్లాకు చెందిన మ‌నోహ‌ర్ ప్ర‌భుత్వోద్యోగం చేస్తుంటారు. కొన్ని స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆయ‌న కాలేయం చెడిపోయింది. దాంతో.. త‌న అన్న ప్రాణాలు కాపాడుకోవ‌డానికి ఆయ‌న చెల్లెలు సంధ్యారాణి  త‌న శ‌రీరంలోని 400 గ్రాముల కాలేయాన్ని దానం చేశారు. ఇప్పుడు ఇద్ద‌రూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. మ‌నోహ‌ర్, సంధ్యారాణి కాలేయం కూడా సాధార‌ణ స్థితికి వ‌చ్చింది.

Leave a Reply

%d