జోడో యాత్ర పునఃప్రారంభం

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర శనివారం జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పునఃప్రారంభమైంది. భద్రతా కారణాల రీత్యా శుక్రవారం యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. తెల్లటి టీషర్ట్‌పై స్లీవ్‌లెస్‌ జాకెట్‌ ధరించిన రాహుల్‌గాంధీ అవంతీపొరా ప్రాంతం నుంచి నడక ప్రారంభించారు. పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ, ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీతో పాటు పెద్దసంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు తరలివచ్చి యాత్రలో పాల్గొన్నారు. శుక్రవారం ఘటనలను దృష్టిలో పెట్టుకొని పోలీసు యంత్రాంగం పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. రాహుల్‌ చుట్టూ మూడంచెల భద్రతా వలయం ఏర్పాటు చేశారు. కాగా, పుల్వామా జిల్లాలో 2019 ఫిబ్రవరిలో జరిగిన కారు బాంబు పేలుడులో మరణించిన 40మంది జవాన్లకు రాహుల్‌ నివాళులర్పించారు. జైషే మహ్మద్‌ ఆత్మాహుతి బాంబర్‌ సీఆర్‌పీఎఫ్‌ బస్సును పేల్చేసిన ప్రదేశంలో ఆయన పుప్ఫగుచ్ఛం ఉంచారు. కాగా, జోడో యాత్ర చివరి దశకు చేరుకుంటున్న వేళ లెత్పోరాలో రాహుల్‌ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఆయనతో కలసి అడుగులేశారు. రాహుల్‌ గాంధీ పర్యటన కశ్మీర్‌లో స్వచ్ఛమైన శ్వాసలా వచ్చిందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. 2019 తర్వాత కశ్మీరీ ప్రజలు ఇంత పెద్దసంఖ్యలో తమ ఇళ్ల నుంచి బయటకు రావడం ఇదే మొదటిసారన్నారు.

Leave a Reply

%d bloggers like this: