కోమటి రెడ్డికి సపోర్ట్ గా జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరి పక్షానా ఉంటారో.. ఎవరికీ తెలియదు. సొంత పార్టీ కిందకే నీళ్లు తీసుకొచ్చే నేతలు ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సమర్థించారు మరో నేత జగ్గారెడ్డి. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఇంకా దుమారం రేపుతున్నాయి. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ అధికారాన్ని చేపట్టేంత మెజార్టీ రాదని , రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ రాబోతోందని… ఏ ఒక్క పార్టీకి 60 స్థానాలు వచ్చే అవకాశం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని… మరొక పార్టీతో కలవాల్సిందేనని తెలిపారు. ఈ వ్యాఖ్యల ఫై ఇప్పటికే పలువురు కాంగ్రెస్ , బిజెపి నేతలు స్పందించడం జరిగింది. ఇక సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం కోమటిరెడ్డి ని సమర్థిస్తూ చెప్పడం ఇప్పుడు వార్తల్లో హైలైట్ అవుతుంది. తాను చెప్పిన వ్యాఖ్యలను వక్రీకరించారని కోమటిరెడ్డి చెప్పిన డైలాగునే జగ్గారెడ్డి కూడా రిపీట్ చేస్తున్నారు. ఆయన చెప్పింది ఒకటైతే.. మీడియాలో వచ్చింది మరొకటి అంటూ.. సమర్థించే పనిలో పడ్డారు జగ్గారెడ్డి. పార్టీకి నష్టం కలిగేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ మంచి కవర్ అప్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఎవరు ఎన్ని మాట్లాడినా.. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని.. రాబోఏ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

%d