సిరుల పంట సంక్రాంతి

సంక్రాంతిని పెద్ద పండుగగా జరుపుకుంటారు. తొలిపంట ఇంటికి పండుగగా రావడమే అందుకు కారణం. సమయంలో అన్నదాతలు ఆ ఎంతో ఆనందంగా ఉంటారు. కళకళలాడే పంట పొలాలను, రాబోయే దిగుబడిని తలచుకొని సంతోష పడుతుంటారు. జనావళికి అన్నం పెట్టే అన్నదాత సంతోషానికి, ఆనందానికి మించినది ఇంకేముంటుంది? అందుకే శ్రమకు సంపదకు గొప్ప స్థానమిచ్చే ఈ ఈ సంక్రాంతి పండుగను బీద, గొప్ప అనే తేడా లేకుండా ఘనంగా జరుపుకుంటారు. కర్షకుల ఆనందంలో పాలు పంచుకుంటారు అందరూ.

సంక్రాంతి నాడు పితృదేవతలకు, అర్హులకు ఏమి దానం చేస్తామో అవి ముందు జన్మలలో కూడా మనకు ఫలితాన్నిస్తాయి. అందుకే ఈ రోజు ఎవరి ఇంటా ‘లేదు’ అనేమాట రాకూడదని పెద్దలు చెబుతారు. అలాగే సంక్రమణ సంక్రమణ కాలంలో ధాన్యం, గోవులు, కంచు, బంగారం లాంటివి దానం చేయాలి. వీటిని దానం చేసేంత శక్తి లేనివారు నువ్వులు లేదా నెయ్యి లేదా వస్త్రాలను దానం చేయాలి. ఫలాలు, కర్రలు, చెరుకు, మీగడలతో పాటు మజ్జిగ దానం చేయడం మంచిది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్యకాలంలో చేసే దానాలకి ఎన్నోరెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడు రోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్ర వర్తికి వరం ఇచ్చాడు. కనుక బలికి ఇష్టమైన దానాలు చేస్తూ సంతోషిస్తారు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయడం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. దక్షిణాయనం పూర్తయి పితృదేవతలు తమ స్థానాలకు వెళితే మళ్లీ ఆరునెలల వరకు రారు కనుక కృతజ్ఞతా పూర్వకంగా తర్పణాలు ఇస్తారు.

మూడు రోజుల సంక్రాంతి సంబరాల్లో చివరిది- కనుమ. ఇది పశుపక్ష్యాదులకు ప్రత్యేకించిన పండుగ. అరక కట్టి పొలాన్ని దున్నడం మొదలుకుని, చేతికందిన పంటను ఇంటికి తీసుకురావడం వరకు కర్షకులకు సేద్యంలో చేదోడువాదోడుగా ఉండేవి పశువులే. వీటికి కనుమ రోజు పూర్తిగా ఆటవిడుపు. ఈనాడు పశువులు ఉన్న ఇంట చేసే హడావుడి అంతా ఇంతా కాదు. కనుమ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడుగుతారు. అందంగా అలంకరిస్తారు. మెడలో గంటలు కడతారు. కొమ్ములకు రంగులు పూస్తారు. ఇత్తడి తొడుగులు తొడుగుతారు. అందమైన వస్త్రాలు కడతారు. నుదుటిపై బొట్లు తీర్చిదిద్దుతారు. ఈ అలంకరణ విషయంలో పోటీలు కూడా జరుగుతాయి. సాయంత్రం వేళ పశువుల పందేలు నిర్వహిస్తారు. తమిళనాడులో అయితే కనుమ నాడు జరిగే పశువుల సందడిని ‘మట్టు పొంగల్’ అంటారు. ‘మట్టు’ అంటే ఎద్దు. ఒకసారి శివుడు తన నంది వాహనాన్ని పిలిచి, భూలోకంలో ఉన్న ప్రజలకు ఒక సందేశాన్ని అందించి రమ్మని చెప్పాడట. ‘రోజూ చక్కగా ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలనీ, నెలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకోవాలన్న’దే ఆ సందేశం. కానీ పాపం నంది కంగారులో శివుడి సందేశాన్ని సరిగా వినలేదు. ‘రోజూ చక్కగా తిని ఉండాలి. నెలకు ఒకసారి మాత్రమే ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని

భూలోకంలో చెప్పాడట. నంది గారి నిర్వాకానికి నివ్వెరపోయిన శివుడు- ‘మానవులు రోజూ తినాలంటే బోలెడు ఆహారాన్ని పండించాలి. అందుకని ఆ ఆహారాన్ని పండిచడంలో నువ్వే వెళ్లి సాయం చెయ్యి’ అని నందిని శపించాడు. అప్పటి నుంచి రైతులు ఆహార పంటలను పండించడంలో, వ్యవసాయ పనుల్లో ఎద్దులు సాయపడుతూ వస్తున్నాయట. తమిళనాట ప్రాచుర్యంలో ఉన్న కథ ఇది.

ఇక, కనుమ నాడు వరికంకుల్ని ఇంటి చూరుకు వేలాడ కడతారు. పిచ్చుకలు, పావురాలు ఇతర పక్షులు వచ్చి వీటిని తింటాయట. ఈ సమయంలో అవి చేసే శబ్దాలు పిల్లలను మురిపిస్తాయి. ఆ సమయంలో ఆ ఇంటి వాతావరణంలో ఒకింత ఆహ్లాదం నిండి ఉంటుంది. మనిషికి కొన్ని పశువులు, పక్షులతో ఉన్న అనుబంధాన్ని చాటుతుంది కనుమ పండుగ. తనతో పాటు ఉన్న మూగజీవాల ఆకలి తీర్చినపుడే మనిషి జీవితానికి సార్థకత అని చాటే పండుగ సంక్రాంతి

Leave a Reply

%d