హరిలో రంగహరి

పుణ్య పర్వం సంక్రాంతి. ఏ కర్మల వలన మనం పవిత్రులవుతామో వాటిని పుణ్యాలు అంటారు. అలాంటి సత్కర్మలకు సత్కాలం లభించడం యోగం. వర్షఋతువులో వ్యవసాయం వలె – పుణ్యకాలాల్లో పుణ్యకర్మలు యోగ్యమై విశేష ఫలాలను ప్రసాదిస్తాయని శాస్త్రవచనం. సూర్యశక్తిలోని దివ్యత్వాన్ని దర్శించిన మహర్షులు, దాన్ని పొందే పద్ధతులను ధార్మిక గ్రంథాల ద్వారా అందించారు. సౌరకాంతి పరివర్తనాన్ని ఆధారం చేసుకున్న పర్వం సంక్రాంతి. ఏమాసమైనా సంక్రమణం దివ్యపర్వమే. అయినా, ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశమైన మకర సంక్రమణానికి విశిష్ట ప్రాధాన్యముందని శాస్త్రోక్తి. స్నాన దాన జపతపాది పుణ్యర్మలు ఈ పర్వకాలంలో పుష్టినిస్తాయని, సత్సంకల్పాలు అవశ్యం ఫలిస్తాయని ఆర్షగ్రంథాల మాట.

సంక్రాంతి రోజున హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దులు వారి సన్నాయి తాళాలు, వివిధ రకాల పందేలు, కోలాటాలతో గ్రామాలన్నీ ఆనందడోలికల్లో తేలియాడుతాయి. ‘హరిలో రంగహరి’ అంటూ అందరికీ వీనుల విందునందించే హరిదాసులు మన సాంస్కృతిక రాయబారులు. నుదుట పొడవాటి బొట్టు, తలపాగా దానిపైన పొందికగా అమర్చిన గుండ్రని పాత్ర, చేతుల్లో చిడతలు, కాళ్లకు గజ్జెలు, పంచె కట్టుతో కూడిన వారి వేషధారణ కనులకూ విందునిస్తుంది. మధురమైన గాత్రంతో చిడతలు వాయిస్తూ ఆనంద పారవశ్యంతో వారు హరికీర్తనలు పాడుతుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. చూడముచ్చటైన అలంకారాలతో దర్జాను ఒలకబోసే గంగిరెద్దులు, ఊరంతా కలియ తిరుగుతూ ఉంటాయి. లయబద్ధంగా సాగుతున్న పాటకు అనుగుణంగా జానపదులు గుంపులుగా వేసే కోలాటం, ఆ ముచ్చట చూడవలసింది కానీ మాటల్లో వర్ణించలేము

దేవతలకు (ప్రత్యేకంగా శివుడికి) నువ్వులనూనె దీపాన్ని అర్పించడం, నువ్వులతో వండిన వంటకాలను నివేదించి, ఆ ప్రసాదాలను ఆరగించడం శ్రేష్ఠమని అనుష్ఠాన ప్రధాన గ్రంధాలు చెబుతున్న విశేషం. తిలలను, బెల్లపు పదార్థాలను కలిపి ఒకరికొకరు అందించుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకోవడం కొన్నిప్రాంతాల ఆచారం. కొత్తబియ్యంతో పాయసం వండి సూర్యభగవానుడికి నివేదించడం వేదాల యజ్ఞాల్లోని అంశం. ఆ వేదసంస్కృతి సామాన్యుల్లోనూ వ్యాప్తమై ‘పొంగల్’ పేరుతో జరుగుతోంది. దీనికి మూలం- వైదికమైన ‘ఆగ్రయణేష్టి’.
మంచికాలంలో మంచి ఆలోచన, మంచి ఆచరణ – అనే – ఒక మంగళకర భావన ఈ పర్వంలో వ్యాపించి ఉంది.

మరికొన్ని ప్రాంతాలలో సంక్రాంతి నాడు బొమ్మల కొలువు పెట్టి బంధుమిత్రులను ఆహ్వానిస్తారు. ఇంకా గాలిపటాలు ఎగురవేయడం, పారు వేట, జల్లికట్టు వంటివి ఆడతారు.

అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులను ఆడించే పిట్టల దొరలు, విచిత్ర వేషధారులు మున్నగు కళాకారులంతా ఈ పండుగ దినాలలో వచ్చి వారివారి కళలను ప్రదర్శిస్తూ, ఎవరికి వారు ఇచ్చే కానుకలను స్వీకరిస్తూ, చివరగా ఒక పాత వస్త్రాన్ని ఇమ్మని కోరి, భుజాన వేసుకుని ‘సుభోజ్యంగా ఉండాలమ్మా’ అంటూ దీవించి వెళతారు. గ్రామ సీమల్లో ఏ కళాకారులనూ రిక్తహస్తాలతో పంపకుండా కలిగిన దానిలో కలిగినంత ఇచ్చి పంపుతారు. ఇదే వారి సదాచారం.

ప్రకృతిలో జీవనగతిపై ప్రభావం చూపే పంచభూతాలు, గ్రహాల రీతులను గమనించి ఒకదానితో ఒకటి అనుబంధమై, ఒకదానిపై ఒకటి స్పందనను ప్రసరిస్తున్న విశ్వరహస్యాలను గ్రహించి – ఋషులు కొన్ని పద్ధతులను నిర్దేశించారు.

ప్రకృతి పరిణామాల పట్ల, మానవ సంబంధాల పట్ల ఒక చైతన్యవంతమైన ఆత్మీయతను చాటిచెప్పే పండుగలివి- అని సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తే స్పష్టపడుతుంది.

ప్రతి ఇల్లూ లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ, బంధుమిత్రులతో కళకళలాడటం సంక్రాంతి శోభ. సామాజికంగా ఉన్న సమైక్యతకు ఈ పర్వం ఒక తార్కాణం. ‘దానం’ ద్వారా అభ్యుదయం సాధించాలని చాటిన ధర్మశాస్త్రాలు, ఈ పండుగను ‘దానపర్వం’గా అభివర్ణించాయి. ఈ సంక్రాంతినాడు స్యలక్ష్మీ కళను ఆరాధించడం, వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో అవశ్యకర్తవ్యంగా భావిస్తారు. ఈ పంటల పండుగనాడు మహాలక్ష్మిని ఆరాధించడం శ్రేష్ఠమని దేవీ మహిమా గ్రంథాలు తెలియజేస్తున్నాయి. పౌష్యలక్ష్మి, సంక్రాంతి లక్ష్మి – అని కీర్తించే జగజ్జననిని రంగవల్లులతో, పసుపు కుంకుమలతో, నవధాన్యంతో ఆరాధించడం సంప్రదాయం

మీ 

మీనాక్షి మధురవాణి

 

 

Leave a Reply

%d bloggers like this: