ఉజ్జయిని మహాంకాళికి మంత్రి తలసాని కుటుంబం తొలిబోనం

ఉజ్జయినీ మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఆషాఢ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి బోనం సమర్పించారు. ఆయన కుటుంబసభ్యులతో కలిసి నేడు వేకువజామున 3.30 గంటలకే ఆలయానికి చేరుకుని, కుటుంబ సమేతంగా బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కుటుంబానికి పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని మంత్రి, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. నేడు, ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్సీ కవిత మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆదమయ్య నగర్‌ కమాన్‌ వద్ద పూజల్లో పాల్గొంటారు.

తెల్లవారుజాము నుంచే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు వరుస కట్టారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో జనాలు వస్తుండడంతో రద్దీ నెలకొనకుండా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మొత్తం ఆరు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బాటా చౌరస్తా నుంచి ఆలయానికి వచ్చే లైను, ఎంజీ రోడ్డు రాంగోపాల్‌ పేట్‌ పాత పోలీస్‌ స్టేషన్‌ కొత్త ఆర్చి గేట్‌ నుంచి మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ మీదుగా ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది.

సికింద్రాబాద్‌ లోని జనరల్‌ బజార్‌ అంజలి టాకీస్‌ వైపు నుంచి వీఐపీలకు ఒకటి, సాధారణ భక్తులకు మరొకటి చొప్పున క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎంజీ రోడ్డు పాత రాంగోపాల్‌ పేట్‌ పీఎస్‌ నుంచి సాధారణ భక్తుల క్యూ లైన్‌ ఉంటుంది. డోనర్‌ పాస్‌ల కోసం ఎంజీ రోడ్డులో ఆలయం వెనక వైపు నుంచి మరో క్యూ లైన్‌ ఏర్పాటు చేశారు. ఎంజీ రోడ్డు పాత రాంగోపాల్‌ పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదురు నుంచి వీవీఐపీలకు అమ్మవారి ఆర్చి గేట్‌ ద్వారా అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.

ఇటు ఆర్టీసీ కూడా ఉజ్జయిని మహాంకాళి బోనాల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతూ ఉంది. భక్తుల సౌకర్యం కోసం నగరంలో దాదాపు 150 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. హైదరాబాద్ లో దాదాపు 19 ప్రాంతాల నుంచి బోనాలు జరిగే ప్రాంతాలకు భక్తులు చేరుకునేలా సిటీ బస్సులను తిప్పడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. బోనాల జాతరకు హాజరయ్యే భక్తులు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం కోరింది.

Leave a Reply

%d bloggers like this: