సీమా పబ్జీ ఆట ప్రేమలో ఉగ్రకుట్ర, మిలటరీ వాళ్ళకు…

సీమా హైదర్ ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. పబ్జీ ప్రేమికురాలుగా ఫేమస్ అయిన సీమా.. ఇప్పుడు పాకిస్తాన్ ఏజెంట్ గా పలు అనుమానాలకు తావిస్తుంది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే సీమా హైదర్ పాకిస్తాన్ ఏజెంట్ అని.. ఆమెను తమ దేశానికి పంపమని గుర్తు తెలియని వ్యక్తులు ముంబై పోలీసులకు ఒక సందేశాన్ని పంపించారు. మరో వైపు ఆమె సోదరుడు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తుండడం ఈ అనుమానాలకు బలం చేకూరుతుంది. చాలా తెలివిగా ఆలోచించి సమాధానాలు చెప్పడంతో ఏటీఎస్ అధికారులు సమాధానాలను రాబట్టడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఈమెకు పాకిస్తాన్ తో గానీ, ఐఎస్ఐతో గానీ సంబంధం ఉన్నట్లు నిరూపించే ఆధారాలు ఏవీ ఇప్పటి వరకూ లభించలేదు.

రెండు రోజుల పాటు దాదాపు 16 గంటలు సుదీర్ఘ విచారణ జరిపిన ఏటీఎస్ అధికారులు.. సీమా హైదర్ తమను తప్పుదోవ పట్టిస్తోందని అనుమానిస్తున్నారు. ఆమె కాన్ఫిడెంట్ గా మాట్లాడడం, అడిగిన చాలా ప్రశ్నలకు బోల్డ్ గా సమాధానం చెప్పడం, ఆమె స్పందనలు అన్నీ కూడా ఏటీఎస్ మరియు ఇతర నిఘా వర్గాలకు మరింత అనుమానాలు కలుగజేస్తున్నాయి. ఇండియాలో ఎవరో ఒక వ్యక్తి ఆమెను గైడ్ చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఈ విషయమై ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఏటీఎస్ అధికారులకు సమాచారం వచ్చింది. సచిన్ కాకుండా ఇండియాలో సీమాకి ఇతర కాంటాక్ట్ లు ఉన్నాయని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు.

నోయిడాలోని రుబూపుర గ్రామానికి చేరేందుకు సీమా హైదర్ కి సహాయం చేసిన వ్యక్తిని విచారణలో గుర్తించలేకపోయారు. అంతేకాదు సీమా హైదర్ కొంతమంది మిలటరీ అధికారులకు ఫ్రెండ్ రిక్వస్ట్ లు పంపినట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు. ఇండియాకి వచ్చే ముందు పాకిస్తాన్ లో 70 వేల పాకిస్తాన్ రూపాయలతో ఒక మొబైల్ ఫోన్ కొన్నట్టు ఆమె విచారణలో వెల్లడించింది. ఫోన్ లో చాటింగ్ చేసేటప్పుడు, సందేశాలు పంపేటప్పుడు జాగ్రత్త వహించమని చెప్పారా అని ఏటీఎస్ అధికారులు విచారణలో అడిగారు. ఫుఫి (ఎఫ్యుఎఫ్ఐ), ఫ్రూట్ వంటి కోడ్ పదాలను వాడావా అని సీమాని అధికారులు అడిగారు. పాకిస్తాన్ కోడెడ్ లాంగ్వేజ్ లో ఫుఫి అంటే.. దేశానికి సంబంధించిన సమాచారాన్ని ఐఎస్ఐకి అందించడం. అలానే ఫ్రూట్ అనే పదం డబ్బుని సూచిస్తుంది.

ఈ కోడ్ వర్డ్స్ గురించి ఏటీఎస్ అధికారులు సీమాని అడగ్గా ఆమెకు ఉర్దూ రాదని.. పాకిస్తాన్ లో ఆ కోడ్ వర్డ్స్ ఉంటాయని తనకు తెలియదని వెల్లడించింది. ఆమె అనర్గళంగా హిందీ మాట్లాడడం.. అధికారిక చదువు లేకపోయినా కఠినమైన హిందీ పదాలను సైతం ఆమె మాట్లాడుతుండడం పట్ల సీమా హైదర్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు పాకిస్తాన్ లో మొబైల్ కొనుగోలు చేసిన బిల్ సమయం, పాస్ పోర్ట్ జారీ చేసిన తేదీ రెండూ ఒకే రోజు కావడంతో అధికారులకు అనుమానాలు రేగుతున్నాయి. మే 8న మొబైల్ ఫోన్ కొన్నట్లు చెప్పిన సీమా.. అదే రోజున ఆమెకు పాస్ పోర్ట్ జారీ అయ్యింది. కేవలం రెండు రోజుల్లో అంటే మే 10న పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోయింది.

అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ చూస్తే పేదరికం నుంచి వచ్చినట్టు ఉంది. అలాంటిది రూ. 70 వేలు పెట్టి ఫోన్ ఎందుకు కొనాల్సి వచ్చింది? తనే కొనుక్కుందా? ఎవరైనా ఇచ్చారా? ఫోన్ కొన్న రోజే పాస్ పోర్ట్ రావడం.. ఆ మరుసటి రెండు రోజుల తర్వాత పాకిస్తాన్ నుంచి బయలుదేరడం.. ఇండియా వచ్చే ముందు మిలటరీ అధికారులకు ఎందుకు ఫ్రెండ్ రిక్వస్ట్ లు పంపింది? ఎంతమందికి పంపింది? ఆమె దగ్గర ఇండియన్ ఆర్మీకి సంబందించిన రహస్య సమాచారం ఉందా? వంటి పలు ప్రశ్నలకు సీమా నుంచి అధికారులు సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా విచారణ కొనసాగుతోంది. అధికారులు విశ్రాంతి లేకుండా దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Leave a Reply

%d