షర్మిల రాక కాంగ్రెస్ కొంపముంచడానికేనా ?

వైఎస్ షర్మిల జగనన్నతో విభేదించి తెలంగాణలో వేరు కుంపటి పెట్టుకొన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఓ ముఖ్య విషయం గమనించకుండా కాళ్ళు ఆరిపోపోయేలా పాదయాత్ర చేసి తాపీగా ఇప్పుడు బాధపడుతున్నారు. అదేమిటంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి, ఆ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ బలపడింది. అది ఏమాత్రం తగ్గకుండా కేసీఆర్‌ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. కనుక రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా తెలంగాణ సెంటిమెంటుతోనే రాజకీయాలు చేస్తున్నాయి. ప్రజలు కూడా తెలంగాణ అంశాలు తప్ప వేటికీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కానీ ఈ విషయం గ్రహించని వైఎస్ షర్మిల తండ్రి రాజశేఖర్ రెడ్డి భజన చేస్తూ రెండేళ్ళుగా తెలంగాణలో కాళ్ళు ఆరిపోయేలా తిరిగారు. దీంతో ఆమె శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. ఏమిచేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్న ఆమెకు కాంగ్రెస్‌ స్నేహ హస్తం అందించి ఒడ్డున పడేసింది. అయితే జగనన్న విడిచిన ఆ బాణాన్ని మళ్ళీ ఆయనపైనే ప్రయోగించాలనుకొంటే, ఆమె అందుకు ఇష్టపడలేదు. అదీగాక… ఏపీ సిఎం జగన్‌ తెర వెనుక చక్రం తిప్పి ఆమెను ఏపీకి రాకుండా తెలంగాణ కాంగ్రెస్‌లోనే చేర్చుకొనేలా చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు ప్రతిగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో బహిరంగంగా చేతులు కలపకపోయినా, లోక్‌సభ ఎన్నికల తర్వాత అవసరమైతే ఇండియా కూటమికే మద్దతు ఇస్తానని హామీ ఇచ్చిన్నట్లు ఆ ఊహాగానాల సారాంశం. అవి నిజమో కాదో తెలీదు కానీ వైఎస్ షర్మిల తెలంగాణ కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైపోయింది. అయితే ఈ విషయం ధృవీకరిస్తూ ఆమె యధాప్రకారం రాజశేఖర్ రెడ్డి భజన కొనసాగించడం చూస్తే, ఆమె రేపు తెలంగాణ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కూడా తన భజనను కొనసాగించనున్నారని అర్దమవుతోంది. ఇంతకాలం ఆమె ఒంటరి ప్రయాణం చేశారు కనుక ఆమె భజనలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. వాటి వలన ఎవరూ రాజకీయంగా నష్టపోలేదు. కనీసం ఆమె కూడా వాటితో ఏమాత్రం లాభపడలేదని రుజువైంది. కానీ ఆమె అలవాటు ప్రకారం కాంగ్రెస్‌ వేదికల మీద రాజశేఖర్ రెడ్డి భజన చేయడం మొదలుపెడితే, బిఆర్ఎస్ పార్టీకి చేజేతులా ఆయుధం అందించిన్నట్లవుతుంది. కేసీఆర్‌ దానిని అందిపుచ్చుకొని తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తే, కాంగ్రెస్‌ కనుచూపు దూరంలో కనిపిస్తున్న విజయావకాశాలు వైఎస్ షర్మిల చేసే రాజన్న భజనతో చేజారిపోతాయి. అందుకే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆమెకు చోటు లేదని, ఆమె అవసరం కూడా లేదని రేవంత్‌ రెడ్డి మొత్తుకొన్నారు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం ‘జగన్మాయలో’ పడటం, అందుకే వైఎస్ షర్మిలని తెచ్చుకోవడం నిజమైతే, దానికి తెలంగాణ కాంగ్రెస్‌ బలవబోతోందని ఖచ్చితంగా చెపొచ్చు. 2014 ఎన్నికలలో తెలంగాణలో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం ఏపీ కాంగ్రెస్‌ను బలిచేసిన సంగతి తెలిసిందే. ఈసారి జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ రాజకీయ లబ్ధి పొందేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ను పణంగా పెట్టడానికి సిద్దపడిన్నట్లుంది. ఎన్నికల సమయానికి ఇది నిరూపితం కావచ్చు. తెలంగాణ కాంగ్రెస్‌ ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఒకటే మార్గం. ఆమె చేత రాజన్న భజన మానిపించి వీలైనంతవరకు పార్టీకి, ఎన్నికలకు దూరంగా ఉంచడమే. కానీ ఇది సాధ్యమా? రేవంత్‌ రెడ్డే చెప్పాలి.

Leave a Reply

%d