తెెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. ముఖ్యంగా సిద్దిపేట, గజ్వేల్ సీట్లపైన అందరి చూపు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆశావాహులు అక్కడ తమ పనుల్లో నిమగ్నమైనారు. ఇక ప్రజా యుద్ధ నౌక గద్దర్ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించడంతో అందరి చూపు ఆ సెగ్మెంట్‌పై పడింది. సిద్దిపేట నియోజకవర్గంలో సేవా రాజకీయాలు ఎక్కువయ్యాయి. మంత్రి హరీశ్‌రావును పార్లమెంట్‌కు పంపుతారని ప్రచారం జరుగుతుండడం, ఇదే సమయంలో సీఎం కేసీఆర్ అన్న కొడుకు వంశీధర్ రావు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతుండడం ఆసక్తి రేపుతోంది. బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటైన హుస్నాబాద్‌పై సీపీఐ ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే పోటీ చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
గద్దర్ నజర్ గజ్వేల్
కొన్నేళ్లుగా కాంగ్రెస్‌కు మద్దతివ్వడం తప్ప ఏ పార్టీలో చేరని ప్రజాయుద్ధ నౌక గద్దర్ సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. పోటీ చేస్తానని చెప్పడమే కాదు ఇకపై తన స్వగ్రామైన గజ్వేల్ నియోజకవర్గంలో తుఫ్రాన్‌లోనే నివాసం ఉంటానని స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గానే బరిలోకి దిగుతానని గద్దర్ చెబుతున్నా ఎన్నికల నాటికి పరిస్థితుల్లో మారే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. హైకమాండ్ ఆదేశిస్తే సీఎం కేసీఆర్‌పై పోటీకి సిద్ధమని ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందర్ రావు ప్రకటించారు.