ఆ ఇద్దరు అన్నదమ్ముళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. ఇద్దరికి పెళ్లిళ్లు కాగా, తమ్ముడేమో సొంతూర్లునే ఉంటూ వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తమ్ముడికి స్థానికంగా ఉన్న ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బయటకు రావడంతో అతన్ని చంపాలని మహిళ బంధువులు ప్లాన్ చేశారు. విషయం తెలుసుకున్న అన్న.. తన తమ్ముడితో బహిరంగ క్షమాపణ చెప్పిస్తా.. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని మహిళ బంధువులను కోరాడు. వారు అవేమీ పట్టించుకోకుండా అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బొప్పరాజుపల్లి సమీపంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన జయరామయ్య, చెంచమ్మ దంపతులకు నాగరాజు, పురుషోత్తం అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులిద్దరూ కూడా బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. ఇద్దరికి వివాహాలయ్యాయి. అయితే నాగరాజు తిరుపతిలో ఉంటూ వర్క్‌ఫ్రం హోం చేస్తుండగా, తమ్ముడేమో బ్రాహ్మణపల్లిలోనే ఉంటూ వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. అయితే గ్రామంలోని ఓ మహిళతో పురుషోత్తానికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం మహిళ కుటుంబ సభ్యులకు ఈ ఏడాది శివరాత్రి రోజు తెలిసింది. దీంతో పురుషోత్తంతో మహిళ కుటుంబ సభ్యులు గొడవపడ్డారు. అదేరోజు అతన్ని చంపాలని వారు నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న సోదరుడు నాగరాజు స్వగ్రామానికి చేరుకుని, తమ్ముడిని బెంగళూరు పంపించాడు. దీంతో మహిళ బంధువులు నాగరాజుపై కక్ష పెంచుకున్నారు. శనివారం రోజు ఆమె కుటుంబ సభ్యులతో నాగరాజు రాజీ చేసుకోవడానికి ప్రయత్నించాడు. తన తమ్ముడితో బహిరంగ క్షమాపణ చెప్పిస్తాను.. కక్షలు వద్దని కోరాడు. అనంతరం నాగరాజు, మహిళ బంధువులు రిపుంజయ, చాణక్యప్రతాప్, మరో ఇద్దరు కలిసి కారులో బయల్దేరారు. బొప్పరాజుపల్లి సమీపంలో కురుపకణం వద్ద ఉన్న లోయలో కారును ఆపారు. నాగరాజు కాళ్లు, చేతులు కట్టేసి కొట్టారు. కారులోనే ఉంచి డోర్ వేశారు. ఇక పెట్రోల్ పోసి నిప్పంటించారు. కారును లోయలోకి తోసేందుకు ప్రయత్నించగా, రాయి అడ్డురావడంతో ముందుకు వెళ్లలేదు. అప్పటికే మంటలు వ్యాపించడంతో భయంతో అక్కడ్నుంచి నిందితులు పరుగులు తీశారు. కారు కాలిపోతున్న దృశ్యాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడిని నాగరాజుగా గుర్తించారు. ఈ ఘటనకు ముందు వీరు మద్యం సేవించినట్లు తెలుస్తుంది. పురుషోత్తం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.