ఫిట్స్ (మూర్ఛ) అనేది మెదడుకు వచ్చే సర్వసాధారణమైన వ్యాధి అని, భారతదేశంలో ప్రస్తుతం దాదాపు కోటిమందికి పైగా ఈ వ్యాధి బాధితులున్నారని కిమ్స్ ఆస్పత్రికి చెందిన
న్యూరాలజిస్టు డాక్టర్ సీతాజయలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం సందర్భంగా సోమవారం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన అవగాహన సదస్సును ఆస్పత్రికి చెందిన న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ మోహన్‌దాస్, ఆస్పత్రి సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు ప్రారంభించారు. ద ఎపిలెప్సీ అసోసియేషన్ ఆఫ్ సికింద్రాబాద్, కిమ్స్ ఆస్పత్రి సహకారంతో ఆస్పత్రి ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో మూర్ఛ వ్యాధిగ్రస్తులతో పాటు సామాన్య ప్రజలూ పాల్గొన్నారు. ఇందులో దీని చుట్టూ ఉన్న అపోహలను దూరం చేయడంపై పలువురు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, ఈ వ్యాధిపై ఉన్న దురభిప్రాయాలను పారద్రోలాలని ఆస్పత్రి సీఎండీ డాక్టర్ బి.భాస్కరరావు సూచించారు.
ఇప్పటికే కొన్నివేల మూర్ఛ శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్ మానస్ పాణిగ్రాహి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘మందులతో తగ్గనప్పుడు శస్త్రచికిత్స చాలా మంచిది. వ్యాధి గురించిన అపోహలు, అది ఉన్నవారిపై చూపుతున్న వివక్ష కారణంగా వారి జీవితాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. మూర్ఛ ఉన్న పిల్లలను పాఠశాలల్లో ఆటలు ఆడించకపోవడం, సామాజిక కార్యకలాపాలకు వారిని దూరం పెట్టడం వల్ల వారి అభివృద్ధి, ఆత్మగౌరవం రెండూ దెబ్బతింటున్నాయి. అలాగే, ఈ సమస్య ఉన్న పెద్దవయసువారికి ఉద్యోగావకాశాల విషయంలో చిన్నచూపు చూడటం, పదోన్నతులు ఇవ్వకపోవడం, కొన్ని ముఖ్యమైన ఉద్యోగాల్లోకి వారిని తీసుకోకపోవడం లాంటివి ఎదురవుతున్నాయి. దురభిప్రాయం, అపోహల కారణంగానే మూర్ఛవ్యాధి ఉన్నవారిని చిన్నచూపు చూస్తున్నారు. చాలామంది ఇది మానసిక అనారోగ్యమని, దీనివల్ల పనులు చేసుకోలేరని, లేదా అది అంటువ్యాధి అని అపోహ పడుతున్నారు. మూర్ఛ ఉన్నవారిలో దాదాపు సగం మందికిపైగా ఇలాంటి వివక్ష ఎదుర్కొంటున్నారు’’ అని చెప్పారు.
మూర్ఛపై అవగాహన పెంచేందుకు అంతర్జాతీయ మూర్చ దినోత్సవాన్ని ప్రతియేటా ఫిబ్రవరి రెండో సోమవారం నిర్వహిస్తారు. ఇది ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ ఎపిలెప్సీ, ఇంటర్నేషనల్ లీగ్ ఎగైనెస్ట్ ఎపిలెప్సీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ కార్యక్రమం. ఈ సంవత్సరం నిర్వహించిన కార్యక్రమం ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా మూర్ఛ ఉన్నవారు ఎదుర్కొంటున్న వివక్షపై దృష్టి సారించింది. మూర్ఛవ్యాధి వల్ల బాధితులు జీవితంలో అన్ని అంశాల్లో ప్రభావితమవుతారు. నిజానికి వ్యాధి వల్ల వచ్చే సమస్యల కంటే, దాని కారణంగా ఎదురయ్యే వివక్షను భరించడమే కష్టం అవుతుంది. ఇది అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలన్నింటిలో ఉంటోంది. దీనివల్ల మూర్ఛ బాధితులు శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఇబ్బంది పడతారు.
మూర్ఛ ఉన్నవాళ్లు సైతం సాధారణ ప్రజల్లాగే జీవితంలో ఏదైనా సాధించగలరని డాక్టర్ సీతాజయలక్ష్మి చెప్పారు. వారికి సరైన చికిత్స అందిస్తే, దాదాపు 70%కు పైగా బాధితులు పూర్తిస్థాయిలో సాధారన జీవనం గడపగలరన్నారు. మూర్ఛను అంటువ్యాధి అని చాలామంది అనుకుంటారు గానీ, అది కాదన్నారు. అలాగే, ఈ వ్యాధి ఉన్నవారికి తెలివితేటల్లో ఎలాంటి లోటూ ఉండదని చెప్పారు. సరైన చికిత్స అందితే వాళ్లు సాధారణ జీవనం గడిపి, ఉద్యోగం చేసుకుంటూ.. పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కనొచ్చన్నారు. ఎపిలెప్సీ అసోసియేషన్ ఆఫ్ సికింద్రాబాద్ అధ్యక్షురాలు డాక్టర్ ఇ.ఎ. వరలక్ష్మి, కార్యదర్శి డాక్టర్ అనుజా పాటిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.