చంద్రబాబు కాన్వాయిపై రాళ్లదాడి

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి తెగబడ్డారు. ఆయన పర్యటనకు నిరసన పేరిట పురపాలక మంత్రి ఆదిమూలపు సురేశ్‌ నేతృత్వంలో అరాచకానికి దిగారు. స్వయంగా ముందుండి తన పార్టీ శ్రేణులను ఉసిగొల్పారు. పోలీసులు కూడా చోద్యం చూస్తూ నిలబడిపోయారు. వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా రాళ్లు రువ్వడంతో చంద్రబాబు సెక్యూరిటీలోని ఎన్‌ఎ్‌సజీ కమాండెంట్‌ సంతో్‌షకుమార్‌ తలకు గాయమైంది. ప్రకాశం జిల్లాలో మూడ్రోజులుగా చంద్రబాబు పర్యటిస్తున్నారు. బుధ, గురువారాల్లో గిద్దలూరు, మార్కాపురం రోడ్‌షోలు, సభలకు జనం పోటెత్తారు. దీంతో చివరి రోజైన శుక్రవారం మంత్రి సురేశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న యర్రగొండపాలెంలో బాబు పర్యటనను అడ్డుకోవాలని అధికార వైసీపీ ఎత్తువేసింది. ఇందుకు గురువారమే వ్యూహం రచించింది. దళిత కార్డును బయటకు తీసి మంత్రిని రంగంలోకి దించింది. ఆయన గురువారం సాయంత్రమే ‘చంద్రబాబూ గోబ్యాక్‌’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. భారీగా జనసమీకరణకు ప్రయత్నించారు. అయినా 150 మంది కార్యకర్తలు మాత్రమే వచ్చారు. మంత్రితో పాటు వీరంతా శుక్రవారం ఆయన కార్యాలయం వద్దకు చేరారు. నల్ల దుస్తులు ధరించిన మంత్రి.. చొక్కా విప్పి అర్ధనగ్నంగా రోడ్డుపై హల్‌చల్‌ చేశారు. బాబు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

 

చంద్రబాబు కూడా తన వాహనం నుంచి బయటకొచ్చారు. ‘ఏం మీ ఊరు రాకూడదా.. అడ్డుకుంటావా’ అని ఆగ్రహంతో ప్రశ్నించారు. అప్పటికే అక్కడకు భారీగా టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. వారిని చూసిన వైసీపీ కార్యకర్తలు చెప్పులు, రాళ్లు విసరడం ప్రారంభించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. దాడులు చేస్తున్న అధికారపార్టీ వారిని వదిలేసి టీడీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అలాగే మంత్రిని, ఆయన అనుచరులను జాగ్రత్తగా క్యాంపు కార్యాలయంలోకి పంపించారు. అటు చంద్రబాబుపై రాళ్లు, చెప్పులు పడకుండా ఎన్‌ఎ్‌సజీ కమేండోలు చుట్టూ రక్షణ కవచంగా నిలిచారు. ఈ క్రమంలో కమాండెంట్‌ సంతో్‌షకుమార్‌ తలకు రాయి తగిలి గాయమైంది. యర్రగొండపాలెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించారు. తలకు మూడు కుట్లు పడ్డాయి. తాము అడ్డుగా లేకపోతే చంద్రబాబుపైనే రాళ్లు పడేవని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. అలాగే ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలు ఊట్ల కోటయ్య, మన్నువ హరిబాబు(త్రిపురాంతకరం మండలం వడ్డిపాలెం)కు తీవ్రగాయాలయ్యాయి. ఈలోపు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు భారీగా అక్కడకు చేరుకుని వైసీపీ కార్యకర్తలవైపు దూసుకెళ్లడంతో వారు వెనక్కి తగ్గారు. మంత్రి, ఆయన అనుచరులు వారి కార్యాలయంలోకి వెళ్లిపోయాక చంద్రబాబు కాన్వాయ్‌ ముందుకుసాగింది. అప్పటికే గాలి దుమారం ప్రారంభమైంది. ఆ తర్వాత జోరువానలోను చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు.

Leave a Reply

%d