మతమార్పిళ్లను రాజకీయం చేయొద్దు: సుప్రీంకోర్టు

బలవంతపు మతమార్పిళ్లను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఇది చాలా తీవ్రమైన అంశమని, దీనికి రాజకీయ రంగు పులమొద్దని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మోసపూరిత మత మార్పిళ్ల (Religious Conversions)ను నియంత్రించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేయాలన్న పిటిషన్‌పై విచారణ జరిపింది.

కానుకలు, ఇతర ప్రలోభాలతో ఆశ చూపించడం లేదా భయపెట్టి, బెదిరించి బలవంతంగా మతమార్పిళ్ల (Religious Conversions)కు పాల్పడే ఘటనను నియంత్రించాలంటూ దాఖలైన పిటిషన్లపై అమికస్‌ క్యూరీగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఏజీని కోరింది. ‘‘ఈ కేసులో మీ సాయం కావాలి. ప్రలోభాలతో జరిగే మత మార్పిళ్లను అరికట్టేందుకు ఏం చేయాలి? దిద్దుబాటు చర్యలేంటీ? అనే విషయంలో సహకారం అందించాలి’’ అని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది.

అయితే ఈ పిటిషన్‌ రాజకీయ కుట్ర కోణంలో వేసిందేనని, తమ రాష్ట్రంలో ఇలాంటివి జరిగే ప్రసక్తే లేదని తమిళనాడు తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది పి.విల్సన్‌ ధర్మాసనానికి తెలిపారు. అయితే ఈ వాదనలపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘కోర్టు విచారణలను మరో రకంగా మార్చకండి. మేం యావత్‌ దేశం గురించి ఆందోళన చెందుతున్నాం. ఒకవేళ బలవంతపు మతమార్పిళ్లు జరగకపోతే అది మంచిదే. అంతేగానీ, ఒక రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఈ కేసును చూడొద్దు. దీన్ని రాజకీయం చేయొద్దు’’ అని కోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.

బలవంతపు మతమార్పిళ్లు (Religious Conversions), మూఢనమ్మకాలు నిరోధించడానికి చర్యలు తీసుకొనేలా కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలంటూ న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గతంలోనూ విచారణ జరిపింది. ఇలాంటి బలవంతపు మత మార్పిళ్లు దేశ భద్రతకు, మత స్వేచ్ఛకు తీవ్ర ముప్పు అని వ్యాఖ్యానించింది. వీటిని అడ్డుకునేందుకు కేంద్రం తీవ్రచర్యలు తీసుకోవాలని, లేకపోతే క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయని తెలిపింది.

Leave a Reply

%d