అనిత ఈ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీలో తన కంటూ ఏ ముద్ర వేసుకున్న నాయకురాలు. వైకాాపాను, ఆ పార్టీ అధినేతను జగన్ మోహన్ రెడ్డిని చెడుగుడు ఆడించాలి అనుకుంటే అది ఒక్క అనితనే సాధ్యం. ప్రతిపక్షాన్ని తన మాటలతో ఇరకాటం పెట్టడంలో సిద్దహస్తురాలు. తెలుగుదేశం అధినాయకత్వం కూడా ఆమెను గట్టిగానే ప్రోత్సహిస్తోంది. ఆమెను ఏకంగా పొలిట్ బ్యూరో మెంబర్ ని కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో అనితకు పాయకరావుపేట టికెట్ కూడా ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఆమెకు చెక్ పెట్టడానికి వైకాపా రంగలోకి దిగింది. పార్టీలో కొత్త పదవిని క్రియేట్ చేసి వరడు కళ్యాణిని తెచ్చి రాజకీయం రూపు మార్చాలని చూస్తున్నారు.
పార్టీ మహిళా అధ్యక్షురాలితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కళ్యాణి ఉత్తరాంధ్రా జిల్లాలలో మహిళా వాయిస్ ని బలంగా వినిపించడమే కాకుండా ఎప్పటికపుడు తెలుగు మహిళ ప్రెసిడెంట్ అనితకు కౌంటర్లు ఇస్తున్నారు. దాంతో ఆమెని జగన్ గుర్తించి ఈ కొత్త పదవిని అప్పగించారు. ఇక మీదట విశాఖ జిల్లా రాజకీయం కాస్తా అనిత వర్సెస్ కళ్యాణిగా మారనుంది అంటున్నారు. అలాగే ఈ ఇద్దరు మహిళా నాయకురాళ్ళు ఢీ అంటే ఢీ అని తలపడతారు అని అంటున్నారు.
మరో వైపున కళ్యాణిని వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటుకు పోటీ పెట్టాలని కూడా జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన వరుడు కళ్యాణి విద్యాధికురాలు. మంచి వక్తగా ఉన్నారు. పైగా ఆమె పక్కా లోకల్. దాంతో ఆ సామాజికవర్గం బలంగా ఉన్న నేపధ్యంలో ఆమెను తెచ్చి ఎంపీ క్యాండిడేట్ గా ఎంపిక చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అంచనా కడుతున్నారు.
ఇక చూస్తే సిట్టింగ్ ఎంపీగా భీశెట్టి సత్యవతి ఉన్నారు. ఆమె గవర సామాజికవర్గానికి చెందిన నాయకురాలు. ఆమెను వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీకి దించుతారు అని అంటున్నారు. ఇలా వరుడు కళ్యాణికి వరసబెట్టి ప్రమోషన్లు అవకాశాలు ఇస్తోంది వైసీపీ అధినాయకత్వం. మరి కళ్యాణి తన దూకుడుని మరింత పెంచుతారా ఆమె అనితతో ఏ రకమైన తీరున పోరాటం చేస్తారు అన్నది చూడాల్సి ఉంది.