కాంగ్రెస్ లో దరఖాస్తుల వెల్లువ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆశావహులు క్యూకడుతున్నారు. ఒక్కో అసెంబ్లీ సీటుకు ముగ్గురు నలుగురు నేతలు దరఖాస్తు చేసుకుంటున్నారు. తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని నేతలకు విన్నవించుకుంటున్నారు. నేటితో (శుక్రవారం ) దరఖాస్తుల గడువు ముగుస్తుంది.  ఇప్పటికే 600 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లలో కొందరు స్వయంగా గాంధీభవన్ కు వచ్చి దరఖాస్తులు సమర్పించారు.  మరికొందరు నేతలు తమ వ్యక్తిగత సిబ్బందితో దరఖాస్తు  పంపించారు.

ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గానికి ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అత్యధికంగా మూడు నియోజకవర్గాలకు దరఖాస్తులు సమర్పించారు. తన ఆశావాహులు అందరితో దరఖాస్తులను పెట్టించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మాజీ ఎంపీ, క్రికెటర్ అజారుద్దీన్ నుంచి దరఖాస్తు చేశారు.  జనగామ నియోజకవర్గం సీటును  మాజీ మంత్రి  పొన్నాల లక్ష్మయ్య ఆశిస్తున్నారు. పొన్నాల తరపున నియోజకవర్గంలోని 4 మండలాల అధ్యక్షులు గాంధీభవన్ కు వచ్చి పొన్నాల తరుపున దరఖాస్తులు సమర్పించారు.

పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి…గురువారమే (ఆగస్టు 24) దరఖాస్తు చేసుకున్నారు. కొడంగల్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా…నల్గొండ అసెంబ్లీ టికెట్ కోసం దరకాస్తు పెట్టారు. కాంగ్రెస్ సీనియర్ జానారెడ్డి తనయుడు జయవీర్ నాగార్జున సాగర్ టికెట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు.  గడువు పొడిగించేది లేదని పీసీసీ స్పష్టం చేయడంతో ఆఖరి రోజు దరఖాస్తుల హడావుడి పెరగబోతుంది.

వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్  పార్టీ చురుగ్గా కసరత్తు చేస్తోంది. ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులను పీసీసీ ఎన్నికల కమిటీ నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థుల చొప్పున స్క్రీనింగ్ కమిటీకి సిఫార్సు చేయనుంది.  దరఖాస్తు చేసుకున్న వారిపై సర్వేలు చేసిన తర్వాత ఫైనల్ గా అభ్యర్థిని ఖరారు చేయనుంది హస్తం పార్టీ.

Leave a Reply

%d bloggers like this: