ఆ పని చేస్తే మహారాష్ట్రలో అడుగు పెట్టను – కేసీఆర్

మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ కు బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ స‌వాల్ విసిరారు. తెలంగాణ లో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తే మ‌హారాష్ట్ర‌కు రానే రాను అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఆదివారం మహారాష్ట్రలోని కంధార్ లోహా లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఒక్కసారి సభ పెట్టగానే మహారాష్ట్ర ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు. నాందేడ్‌లో సభ పెట్టిన తర్వాతే బడ్జెట్‌లో రైతులకు కేటాయింపులు చేసినట్టు గుర్తు చేశారు. ఆ సభ తర్వాతనే.. రైతులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నట్టు తెలిపారు. మరీ అంతకు ముందు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశించారు. తెలంగాణ‌లో 24 గంటల క‌రెంట్ ఇస్తున్నాం. రైతుబంధు, రైతుబీమా అమ‌లు చేస్తున్నాం. పండించిన ప్ర‌తి పంట‌ను కొనుగోలు చేస్తున్నాం. తెలంగాణ త‌ర‌హా అభివృద్ధి ఫ‌డ్న‌వీస్ చేస్తే నేను మ‌హారాష్ట్ర‌కు రాన‌ని ప్ర‌క‌టిస్తున్నాన‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ త‌ర‌హా ప‌థ‌కాలు మ‌హారాష్ట్ర‌లో అమ‌లు చేయ‌నంత వ‌ర‌కు నేను వ‌స్తూనే ఉంటాన‌ని తేల్చిచెప్పారు. మ‌హారాష్ట్ర‌లో ద‌ళితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ‌లో ద‌ళిత బంధు అమ‌లు చేస్తున్నాం. ద‌ళిత వ‌జ్రం, రాజ్యాంగ నిర్మాత అంబేద్క‌ర్ పుట్టిన ఈ గ‌డ్డ‌పై ద‌ళిత బంధు అమ‌లు చేస్తే రాన‌ని ప్ర‌క‌టిస్తున్నాన‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

%d bloggers like this: