తెలంగాణలో కమలంతో పొత్తు లేదు – చంద్రబాబు

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెండు పార్టీల మద్య పొత్తుల విషయంలో కొంత స్పష్టత వచ్చింది. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిజెపితో పొత్తులు ఉండవని, టిడిపి ఒంటరిగానే పోటీ చేస్తుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణలో టిడిపి అభ్యర్ధులను ప్రకటిస్తామని చెప్పారు. ఏపీలో బిజెపితో పొత్తులపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని కనుక ఇప్పుడే ఏమీ చెప్పలేనన్నారు. రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయని కనుక అప్పటి పరిస్థితులను బట్టి తగిన నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. టిడిపితో పొత్తులకు బిజెపి ఇష్టపడటం లేదని వైసీపీ చేస్తున్న వాదనల గురించి విలేఖరులు అడిగినప్పుడు, “మా రెండు పార్టీల మద్య అంతర్గతంగా ఏమి చర్చలు జరుగుతున్నాయో వాళ్ళకేమి తెలుసు?అందుకే నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. టిడిపి గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అయిపోతుందనే సంగతి వాళ్ళకి కూడా తెలుసు,” అని చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ని మార్చడంతో ఆ రాష్ట్రంలో బిజెపి పరిస్థితి ఒక్కసారిగా తారుమారు అయ్యింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకొంది. ఈ విషయం బిజెపి అధిష్టానానికి తెలియదనుకోలేము. తెలంగాణలో లక్షలాదిమంది ఆంద్రా ప్రజలు స్థిరపడి ఉన్నారు. కనుక హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ వంటి కొన్ని ప్రాంతాలలో నేటికీ టిడిపి ఓటర్లను ప్రభావితం చేయగల శక్తి కలిగి ఉంది. అయినా బిజెపికి సాయపడేందుకు ముందుకు వస్తున్న టిడిపిని వద్దనుకోవడం నిర్ణయించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే దీనికి బలమైన కారణమే ఉంది. ఒకవేళ టిడిపితో బిజెపి పొత్తులు పెట్టుకొంటే, వెంటనే కేసీఆర్‌ తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తారు. ఇప్పటికే కేంద్రం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందని వాదిస్తున్న కేసీఆర్‌, ఇప్పుడు మోడీ-చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి తెలంగాణను దోచుకోవడానికి వస్తున్నారంటూ ప్రచారం చేస్తే బిజెపి నష్టపోతుంది. అయితే టిడిపితో బిజెపి ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోకపోయినా పరోక్షంగా సహకారం తీసుకోవచ్చు.

Leave a Reply

%d