అడ్డు తొలగిస్తే కావాల్సింది చేస్తా

 ఓ యువతితో భర్త వివాహేతర సంబంధం ఆమె సంసారంలో కలతలు సృష్టించింది. ఎలాగైనా ఆ యువతిని అడ్డు తొలగించుకోవాలని తన క్రిమినల్ బ్రెయిన్‌కు పనిచేప్పింది. భర్త, భర్త ఫ్రెండ్‌తో కలిసి చర్చించి యువతిని అడ్డుతొలగించుకునేందుకు స్కేచ్ వేసింది. ముగ్గురు కలిసి పక్కా ప్లాన్‌తో పథకాన్ని అమలు చేశారు. అటువైపు ఎవరూ రాకుండా మరో యువతిని కాపలా ఉంచి..యువతి గదిలోనే ఆమెను హతమార్చారు. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ యువతి నాలుగు నెలల గర్భవతి.

ఇటీవల మేడ్చల్ జిల్లా డబీల్‌పూర్‌(Dabilpur)లో జరిగిన యువతి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేధించారు. డబీల్‌పూర్‌‌లో ఒంటరిగా నివసిస్తున్న యువతి (22) ఆదివారం హత్యకు గురైన విషయం తెలిసిందే.. ఆమె హత్యకు వివాహేతర సంబంధమే కారణమన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితుడు చాంద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా వివాహేతర సంబంధం అంగీకరించినట్లు తెలిసింది. ఆమె నాలుగు నెలల గర్భవతి అని పేర్కొన్నాడు. ఈ విషయమై భార్యతో గొడవలు జరుగుతున్నాయని వెల్లడించినట్లు తెలిసింది.

హత్యకు పన్నాగం

భర్త వివాహేతర సంబంధం తన సంసారంలో చిచ్చు రేపడంతో చాంద్‌ భార్య ఆమె అడ్డు తొలగించాలని చాంద్‌తో పాటు అతడి స్నేహితుడు అజీంతో చర్చించింది. ఆమె అడ్డు తొలగిస్తే అజీంకు కావాల్సిన సాయం చేస్తానని ఒప్పుందం కుదుర్చుకుంది. దీంతో అజీం తనతోపాటు పనిచేసే మందాకిని అనే యువతి సాయంతో ఆదివారం ఉదయం డబీల్‌పూర్‌లో ఉంటున్న యువతి ఇంటికి చేరుకున్నారు. మందాకిని ఇంటి సమీపంలో కాపలా కాస్తుండగా, అజీం యువతి రెండు చేతులు కట్టి, అక్కడే ఉన్న టవల్‌తో మెడకు ఉచ్చు బిగించి హత్య చేశాడు. కొన్ని గంటల్లోనే కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఒరిస్సాకు చెందిన ధరిత్రి సింగ్‌(22)అనే యువతి ఆరునెలల క్రితం డబిల్‌పూర్‌ గ్రామంలోని మహంకాళి గుడి సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆదివారం ఉదయం 10గంటల సమయంలో ధరిత్రిసింగ్‌ ఉండే ఇంటి నుంచి అరుపులు వినిపించడంతో స్థానికులు ఆమె ఇంటి వద్దకు వెళ్లి చూడగా అనుమానాస్పద స్థితిలో ధరిత్రి సింగ్‌ మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు వెంటనే సమాచారం అందించగా వారు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. కాగా జాగిలాలు ఘటనాస్థలం నుంచి కొద్దిదూరం వరకు వెళ్లి మద్యం షాపు వరకు వెళ్లి ఆగిపోయాయి. చేతులు కట్టి, టవాలుతో గొంతు నులుమి హత్యచేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.

యువతి హత్య వెనుక వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి ఒంటరిగా ఒరిస్సా నుంచి జీవనోపాధి నిమిత్తం డబీల్‌పూర్‌ గ్రామ సమీపంలోని విల్లోస్ర్పిగ్‌ అనే రిసార్టులో పనిచేస్తూ అక్కడ మేనేజర్‌గా పని చేస్తున్న చాంద్‌తో పరిచయం పెంచుకున్నట్లు గుర్తించారు. తరుచూ చాంద్‌ ధరిత్రి సింగ్‌ను కలవడానికి వచ్చేవాడని విషయం దర్యాప్తులో తేలటంతో పోలీసులు ఇదే కోణం నుంచి తమ దర్యాప్తును ప్రారంభించారు. కొద్ది రోజుల అనంతరం మృతురాలు విల్లో స్ర్పింగ్‌లో పని మానేసి ఓ పరిశ్రమలో పనికోసం చేరి డబిల్‌పూర్‌ గ్రామంలో ఉంటున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు.

నిందితుడు చాంద్‌కు భార్య, ఓ కూతురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతురాలితో చాంద్‌కు వివాహేతర సంబంధం ఏర్పడి ఆమె గర్భందాల్చడంతో ఆమె అడ్డుతొలగించుకోవటానికి చాంద్‌ ఈ హత్యకు పాల్పడ్డాడని ఉండొచ్చని భావించారు. కాగా ఈహత్య చాంద్‌కు ఎవరైనా సహకరించి ఉండవచ్చని, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించడంతో నిజాలు బయటకొచ్చాయి.

Leave a Reply

%d