కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్.. అధికార బీఆర్‌ఎ్‌సకు మరో షాక్..! మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హస్తం గూటికి చేరనున్నట్లు తెలిసింది. మంగళవారం ఈ మేరకు జోరుగా ప్రచారం సాగింది. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో తీగల విడివిడిగా చర్చలు జరిపినట్లు సమాచారం. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో గురువారం పలువురు బీఆర్‌ఎస్ నేతల చేరికలున్న నేపథ్యంలో.. మంగళవారం ఉదయం తీగలతో ఠాక్రే సంప్రదింపులు సాగించినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆయన చేరికకు సంబంధించి బుధవారం స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు కృష్ణారెడ్డితో పాటు ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అనితారెడ్డి కూడా కాంగ్రె్‌సలోకి వెళ్లనున్నట్లు తెలిసింది. అయితే, ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు, తీగల ఇంతవరకు ధ్రువీకరించలేదు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీఆర్‌ఎ్‌సలోకి రావడంతో వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం టికెట్ దక్కదని కృష్ణారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఆయన కాంగ్రె్‌సలో చేరతారని కొద్ది రోజులుగా కథనాలు వస్తున్నాయి. తీగలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ వారు సైతం సంప్రదింపులు జరుపుతున్నారు కూడా. కాగా, కృష్ణారెడ్డి.. రేవంత్, ఠాక్రేలను కలిసిన సమయంలో అనితారెడ్డి కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ, ఆమె బీఆర్‌ఎస్ జడ్పీటీసీ సభ్యులతో కలిసి గోవా పర్యటనకు వెళ్లారు. వారితో పాటుగానే కాంగ్రెస్ లో చేరతారా? అన్న సందేహాలూ వ్యక్తమయ్యాయి.
కాంగ్రెస్‌లోకి తీగల కృష్ణారెడ్డి
