రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవానికి భంగం కలుగుతున్న నేపథ్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో శుక్రవారం దీక్ష నిర్వహించనున్నట్టు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘ఈ దీక్షకు అన్ని పార్టీల మహిళా నేతలను ఆహ్వానించాం. సైకో సీఎం జగన్ పరిపాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయి. గత నాలుగేళ్లలో జాతీయ నేర నివేదిక ప్రకారం రాష్ట్రంలో మహిళలపై 1,14,356 దాడులు, అకృత్యాలు జరిగాయి. ఇవి కాకుండా వలంటీర్ల వేధింపులకు సంబంధించి 4,320 కేసులు నమోదయ్యాయి. కొద్దికాలంగా హోం మంత్రి బయటకు రావడం లేదు. ఆమె కనిపించడం లేదని ప్రజలు డీజీపీకి ఫిర్యాదు చేయాలి. రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉందని డీజీపీతో సాక్షాత్తూ ముఖ్యమంత్రే అబద్ధాలు చెప్పిస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్నామనే మాపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. సీఎం సతీమణి భారతి ఒక్కరే మహిళ కాదని, మిగిలిన వారు కూడా మహిళలేనని పోలీసులు తెలుసుకోవాలి’’ అని అనిత అన్నారు. ఈ సందర్భంగా ఆత్మగౌరవ దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో తెలుగు మహిళ జిల్లా నేతలు పలువురు పాల్గొన్నారు.
నేడు విజయవాడలో మహిళల ఆత్మగౌరవ దీక్ష: అనిత
