ఎన్సీపీ మొత్తం ‘మహా’ సర్కారుతోనే

రాష్ట్రాభివృద్ధి కోసమే ఏక్‌నాథ్‌ శిందే ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నామని మహారాష్ట్ర కొత్త డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆయన కొనియాడారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్సీపీ మొత్తం మహారాష్ట్ర సర్కార్‌తోనే ఉందని స్పష్టం చేశారు. పార్టీలో ఎలాంటి చీలిక లేదని, భవిష్యత్తులోనూ ఎన్సీపీ పేరు, గుర్తుపైనే పోటీ చేస్తామని వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యేలు కొందరు విదేశాల్లో ఉన్నారని.. మరికొందరు ముంబై రాలేకపోయారని.. తనతో వారంతా టచ్‌లోనే ఉన్నారని, తన నిర్ణయానికి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ఎన్డీయేతో పొత్తు గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘‘మూడున్నరేళ్ల కింద ఉద్ధవ్‌ ఠాక్రేతో కలిసి మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వంతో చేతులు కలిపాం. ఆరోజు శివసేనతో కలిసి వెళ్లినప్పుడు ఇప్పుడు బీజేపీతో ఎందుకు వెళ్లకూడదు. రాష్ట్రాభివృద్ధే ఎజెండా అయినప్పుడు ఎవరితో కలిసినా తప్పులేదు’’ అని పవార్‌ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. మోదీ నాయకత్వంలో నడుస్తున్న డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఇప్పుడు ట్రిపుల్‌ ఇంజన్‌ ప్రభుత్వంగా మారిందని సీఎం ఏక్‌నాథ్‌ శిందే చెప్పారు. ‘‘ఇప్పుడు మనకు ఓ సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలున్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కారు కాస్త ట్రిపుల్‌ ఇంజన్‌ సర్కారుగా మారింది. అజిత్‌ పవార్‌ అనుభవం మహారాష్ట్రను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది’’ అని చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: