తెలంగాణ ఇవ్వకుంటే బిచ్చమెత్తుకునే వారు – రేవంత్ రెడ్డి

‘అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుంటే ఈ రోజు పదవులు అనుభవిస్తున్న మీరు బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి ఉండేది. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తేనే నీ అయ్య సీఎం, నువ్వు, మీ బావ మంత్రులు, మీ చెల్లె ఎమ్మెల్సీ అయ్యింది. ఈ రోజు మీరు అనుభవిస్తున్న వైభవానికి కారణం కాంగ్రెస్‌ పార్టీ’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందని కేటీఆర్‌ అడుగుతున్నారని, దేశంలో, రాష్ట్రంలో ప్రతీ ప్రాజెక్టు కాంగ్రెస్‌ కట్టిందేనన్నారు.

రాత్రి బోధన్‌లో సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌, దేశంలో మోదీ కులాలు, మతం పేరుతో ప్రజలను విభజించి పాలించాలని చూస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తిచేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఈ ప్రాంతంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, ఎమ్మెల్యేలు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌కు పాస్‌పోర్టులు, బియ్యం, ఇసుక అక్రమ రవాణాలో ప్రమేయం ఉందన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లయినా ఇస్తామన్న ముస్లిం రిజర్వేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్‌ మంచి చేసింది కాబట్టే వర్షం వచ్చింది. వరుణ దేవుడు కాంగ్రె్‌సలో చేరాడు’ అని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతీ పేదోడు ఇల్లు కట్టుకునేందుకు రూ.ఐదు లక్షలు ఇస్తామన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అమలు చేస్తామన్నారు. వైద్యం కోసం రూ.5 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఆడబిడ్డలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. చక్కెర ఫ్యాక్టరీలను ఆరు నెలల్లోగా తిరిగి తెరుస్తామన్నారు. చెరుకు, పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్నలు గిట్టుబాటు ధరకు కొంటామన్నారు.

Leave a Reply

%d