తెలుగు రాష్ట్రాల మధ్య రేపటి (15) నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (02844) అందుబాటులోకి రానుంది. ఈ మేరకు వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు. ఆదివారం తప్ప మిగిలిన ఆరు రోజులు ఈ రైలు నడుస్తుంది. రైలును రేపు ప్రారంభిస్తుండడంతో ఆ ఒక్క రోజు మాత్రం నిర్ణీత సమయంలో కాకుండా ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. రాత్రి 8.45 గంటలకు విశాఖపట్టణం చేరుకుంటుంది. తొలి రోజు ఈ రైలు మొత్తం 21 స్టాపుల్లో ఆగుతుంది.
చర్లపల్లి, భువనగిరి, జనగామ కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమహేంద్రవరం, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలోనూ ఆగుతుంది. అయితే, రెగ్యులర్ సేవలు ప్రారంభమయ్యాక మాత్రం కొన్ని స్టేషన్లకే రైలు పరిమితం అవుతుంది.
ఎల్లుండి (16) నుంచి మాత్రం ప్రయాణ వేళలు ముందే ప్రకటించినట్టుగా ఉంటాయి. అంటే ఉదయం 5.45 గంటలకు విశాఖలో బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం మూడు గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈసారి మాత్రం రైలు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. ఈ రైలుకు రిజర్వేషన్ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.