ఉదయం లేవగానే గంట పాటు నడిస్తే మన ఆరోగ్యానికి మంచిదేనన్నారు నటి మంచు లక్ష్మి. నన్ను దేవుడు ప్రత్యేకంగా ఏం తయారు చేయలేదు. నేను ప్రతి రోజు ఆరోగ్యం కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తాను కాబట్టే ఇలా ఉన్నానని వ్యాఖ్యానించారు. కిమ్స్ హాస్పిటల్స్ వాస్కూలర్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో నిర్వహించిన వాక్ లో ఆమె పాల్గొన్నాని ఈ సంధర్భంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ వాస్క్యులర్, ఎండోవాస్క్యులర్ సర్జన్ డాక్టర్ నరేంద్రనాథ్ మేడా మాట్లాడుతూ, ‘‘ఎక్యూట్ వీనస్ థ్రాంబో ఎంబోలిజం (వీటీఈ), డీప్ వీనస్ థ్రాంబోసిస్ (డీవీటీ), పల్మనరీ ఎంబోలిజం (పీఈ).. ఈ మూడింటి వల్ల దీర్ఘకాల సమస్యలతో పాటు మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంటుంది. ఇటీవలి కాలంలో ఎక్కువగా నిశ్చల జీవనశైలి, దురలవాట్ల కారణంగా సాధారణ ప్రజానీకంలోనూ డీవీటీ సమస్య కనపడుతోంది. అంతర్జాతీయంగా మార్చి నెలను డీవీటీ అవగాహన మాసంగా పరిగణిస్తారు. శరీరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నరాల్లో రక్తం గడ్డకట్టడమే డీవీటీ. ఇది ఎక్కువగా కాళ్లలో కనపడుతుంది. దీనివల్ల సాధారణ రక్తప్రసారానికి ఆటంకం కలుగుతుంది. ఈ గడ్డలు రక్తంతోపాటు శరీరంలోకి ప్రవహించి.. గుండె, ఊపిరితిత్తుల్లోకీ చేరుతాయి. ఇది ప్రాణాంతకం అవుతుంది. కాళ్లలో వాపు, నొప్పి, రంగుమారడం, చర్మం బాగా వేడెక్కడం లాంటివి కనిపిస్తాయి. చాలావరకు డీవీటీ కేసుల్లో లక్షణాలు బయటపడకపోవడం వల్ల చికిత్స ఆలస్యమై మరణాలు సంభవిస్తాయి. డి-డైమర్ అనే రక్తపరీక్షతో పాటు నరాలకు అల్ట్రాసౌండ్, వీనోగ్రఫీతో డీవీటీని అంచనా వేయొచ్చు. ఇంతకుముందు డీవీటీ వచ్చినవారు, స్ట్రోక్ బాధితులు, గర్భిణులు, ఊబకాయులు, పెద్ద శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు, 65 ఏళ్లు దాటినవారు, ఎక్కువసేపు ప్రయాణం చేసినవారు, పూర్తి విశ్రాంతిలో ఉన్నవారికి ఇతరుల కంటే డీవీటీ వచ్చే అవకాశాలు ఎక్కువ’’ అని తెలిపారు.
గౌరవ అతిథిగా పాల్గొన్న కిమ్స్ ఆస్పత్రుల గ్రూప్ సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు మాట్లాడుతూ, ‘‘ఒక కాలిలో వాపు కనపడటం, నొప్పితో పాటు చర్మం కాస్త వేడెక్కడం, ఎర్రగా మారడం, నరాలను చేత్తో ముట్టుకుని చూస్తే అవి గట్టిగా అయినట్లు అనిపించడం.. ఇవన్నీ డీవీటీ లక్షణాలు. కేవలం కాళ్లలోనే కాదు, చేతులు, పొట్ట ప్రాంతంలోనూ డీవీటీ సంభవించే అవకాశం ఉంటుంది. ఇది వచ్చినప్పుడు ఊపిరి సరిగా అందకపోవడం, గుండెనొప్పి అనిపించడం కూడా ఉండొచ్చు. 60 ఏళ్లు దాటినవారు, అధిక బరువు ఉన్నవారు, పొగతాగేవారు, కేన్సర్ లేదా గుండెపోటు లాంటివి వచ్చినవారు, వెరికోస్ వెయిన్స్ ఉన్నవారికి డీవీటీ వచ్చే అవకాశాలు ఎక్కువ. మూడు గంటలకు పైగా కారు, రైలు, విమానాల్లో ప్రయాణం చేసినవారికీ ఈ సమస్య రావచ్చు. అసలు ఇలాంటి కారణాలు ఏమీ లేకపోయినా ఇది రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజూ తప్పనిసరిగా నడవడం, కూర్చున్నప్పుడు ప్రభావితమైన కాలిని పైకి లేపి పెట్టుకోవడం, దీనికి మందులు తీసుకుంటున్నప్పుడు విమాన ప్రయాణాలను రెండు మూడు వారాలు వాయిదా వేసుకోవడం మంచిది’’ అని సూచించారు.