వివాహితపై ఇంటి యజమాని లైంగిక వేధింపులు

2006 లో తోర్రూర్ గ్రామానికి చెందిన పస్తం శ్రీను కు మంజుల(34) తో వివాహం జరిగింది. పదేళ్ల క్రితం ఉపాది కోసం ఈ దంపతులు ముంబాయికి వెళ్లారు. మూడు నెలల క్రితం తెలంగాణకు వచ్చి వర్ధన్నపేటలో జాటోత్ జితేందర్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు దిగారు. శ్రీను కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ వచ్చిన జితేందర్ కన్ను మంజులపై పడింది. ఆమెను ఎలాగైనా లొంగదీసుకొని తన కోరిక తీర్చుకోవాలన్న దుర్బుద్ది జితేందర్ లో కలిగింది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆమెను లైంగికంగా లొంగదీసుకోవాలని యత్నించాడు. దీంతో మంజుల కుటుంబ సభ్యులు తొర్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కానీ జితేందర్ లో మార్పు మాత్రం రాలేదు. దీంతో పెద్దమనుషల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు.

జితేందర్ పదే పదే ఫోన్ చేయడం.. మానసికంగా హింసించడం మొదలు పెట్టడంతో అతడి వేధింపుల తట్టుకోలేక మంజుల 15 రోజుల క్రితం తన సోదరి శారద ఇంటికి వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లిన జితేందర్ మాయమాటలు చెప్పి ఆమెను వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని తన గదికి తీసుకువెళ్లాడు. అక్కడ నుంచి తప్పించుకున్న మంజుల ఎలుకల మందు తాగింది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ మంజుల జులై 24న కన్నుమూసింది. తన భార్యను ఇంటి ఓనర్ జితేందర్ లైంగికంగా హింసించడం.. ఆమెపై దౌర్జన్యం చేయడం వల్లనే ఆత్మహత్య చేసుకుందని మంజుల భర్త శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Leave a Reply

%d