కేంద్రంలోని మోదీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాల కూటమిని కూడగట్టుకుంటున్న కాంగ్రెస్ మరో ముందడుగు వేసింది. వ్యూహాత్మకంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆ్‌ప)ను తనవైపు తిప్పుకొంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఢిల్లీ ఆర్డినెన్స్’ను వ్యతిరేకిస్తామని ప్రకటించింది. తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ, బిహార్ సీఎం నీతీశ్‌కుమార్‌ల దౌత్యంతో ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం.. విపక్షాలు సంఘటితం అవ్వడానికి దోహదపడుతోంది. ఢిల్లీలో గ్రూప్-ఏ అధికారుల నియామకాలు, బదిలీలకు ఓ అథారిటీని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మే 19న ఆర్డినెన్స్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే..! ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి కాకుండా.. కేంద్రానికి అధికారాలను దఖలుపరచడం తగదంటూ ఆప్ వ్యతిరేకిస్తూ వస్తోంది. కేంద్ర ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించి, తమకు మద్దతివ్వాలంటూ ఆప్ జాతీయ సమన్వయకర్త, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్ని పార్టీలను కోరిన విషయం తెలిసిందే. విపక్ష కూటమిని కూడగట్టే క్రమంలో కాంగ్రెస్ పార్టీ గత నెల బిహార్‌లో నిర్వహించిన సమావేశానికి సైతం ఆప్ హాజరవ్వలేదు. ఢిల్లీ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తేనే తమ మద్దతంటూ ఆప్ తేల్చిచెప్పింది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్‌తోపాటు.. గోవా, మహారాష్ట్రల్లో ఆప్ మద్దతు తప్పనిసరి అని గుర్తించిన కాంగ్రెస్– సోమవారం బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన చేశారు. తమ ఈ ప్రకటనతో సోమ, మంగళవారాల్లో బెంగళూరులో జరగనున్న 24 ప్రతిపక్ష పార్టీల సమావేశానికి ఆప్ కూడా హాజరవుతుందని భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఢిల్లీలో సివిల్ సర్వీసుల నియంత్రణకు సంబంధించిన ఆర్డినెన్స్ విషయంలో మా వైఖరి స్పష్టంగా ఉంది. దాన్ని ఏ మాత్రం సహించబోము. ఈ ఒక్కటే కాదు. సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగేలా కేంద్రం తీసుకునే ఏ నిర్ణయాన్ని కూడా ఆమోదించేది లేదు. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో మా పూర్తి మద్దతు ఆప్‌కు ఉంటుంది’’ అని ఆయన వివరించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కూడా ఢిల్లీ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. ‘‘ఎన్నికైన ప్రభుత్వాల సమాఖ్య స్ఫూర్తిపై ఏ దాడి జరిగినా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లోనూ, బయటా వ్యతిరేకిస్తుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ఆప్ నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ ఛద్దా స్వాగతించారు. ఇది సానుకూల పరిణామమని వ్యాఖ్యానిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆ తర్వాత తమ పార్టీ బెంగళూరులో సోమవారం విపక్షాల భేటీలో పాల్గొంటుందని, ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో తీర్మానించినట్లు చెప్పారు.
ఢిల్లీ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీజేపీ విసుర్లు రువ్వింది. కాంగ్రెస్ నేతలు ఒక్కతాటిపై నిలబడరంటూ ఎద్దేవా చేసింది. ఈ మేరకు బీజేపీ ఐటీ వింగ్ చీఫ్ అమిత్ మాల్వియా మాట్లాడుతూ.. ఢిల్లీ కాంగ్రెస్ ఆప్‌ను వ్యతిరేకిస్తోందని గుర్తుచేశారు. ‘‘ఢిల్లీ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించేది లేదని పంజాబ్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. కానీ, ఆర్డినెన్స్‌కు తాము వ్యతిరేకమంటూ కాంగ్రెస్ తాజాగా ప్రకటించింది. అంతేకాదు.. కాంగ్రెస్ సీనియర్ అధిర్ రంజన్ చౌదరి లాంటి వారు మమతాబెనర్జీకి వ్యతిరేకంగా ఉంటున్నారు. కానీ, కాంగ్రెస్ అగ్రనాయకత్వం మాత్రం ఆమె మద్దతుకోసం ప్రయత్నిస్తోంది’’ అని వ్యంగ్యంగా అన్నారు.
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఏర్పాటు చేసిన సలహా సంఘం శనివారం సమావేశమై చర్చింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ రహస్య భేటీకి కమిటీ సభ్యులు 8 మందీ హాజరయ్యారు. ఈ కమిటీలో కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ న్యాయవాదులు పి.చిదంబరం, అభిషేక్ మను సింఘ్వీ, సల్మాన్ ఖుర్షీద్, మనీశ్ తివారీ, వివేక్ తన్ఖా, కేటీఎస్ తులసితో పాటు ఎస్టీ నేత, ఒడిసాకు చెందిన లోక్‌సభ సభ్యుడు సప్తగిరి ఉలాకా, ఎస్సీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఎల్ హనుమంతయ్య ఉన్నారు. భారతదేశ భిన్నత్వాన్ని గౌరవించని ఎలాంటి చర్యలనైనా తిరస్కరించాలని, వివిధ మతాలకు ఉన్న పర్సనల్ చట్టాల స్థానంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరం లేదని సమావేశం అభిప్రాయపడినట్టు తెలిసింది. ‘ప్రస్తుత దశలో యూసీసీ అవసరం లేదని మాలో చాలామంది అభిప్రాయపడ్డాం. యూసీసీ అమలు తగదని, ఆచరణ సాధ్యం కూడా కాదని 21వ లా కమిషన్ 2018లో తన నివేదికలో స్పష్టం చేసింది. ఏమైనప్పటికీ యూసీసీ ముసాయిదా వచ్చే వరకు వేచి చూస్తాం’ అని సలహా సంఘం సభ్యుడు ఒకరు తెలిపారు. యూసీసీ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆలోచన సరికాదని, ఒకప్పుడు బీజేపీకి మిత్రపక్షమైన శిరోమణి అకాలీ దళ్ యూసీసీ ఎందుకు అవసరం లేదో గట్టిగా తన వాదన వినిపించిందని మరో సభ్యుడు పేర్కొన్నారు.